తమిళనాడులోని పురాతన దేవాలయాల్లో శ్రీ బృహదీశ్వర ఆలయం ఒకటి. ఈ ఆలయానికి రెండు ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. ప్రపంచంలోనే మొట్ట మొదటి గ్రానైట్ ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. కావేరి నది ఒడ్డున ఉన్న తంజావూరు నగరం గొప్ప వారసత్వ సంపదకు పెట్టింది పేరు. తమిళనాడులోని పురాతన నగరాలలో ఇది ఒకటి. ఈ నగరం ద్రావిడ యుగానికి ప్రసిద్ధి చెందింది. తంజావూరును తమిళనాడు ధాన్యపు గిన్నె లేదా దేవాలయాల నగరం అని కూడా పిలుస్తారు. ఈ నగరాన్ని గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.
తంజావూరు నగరం ఒకప్పుడు చోళులకు బురుజుగా ఉండేది. అంతేకాదు ఇది చోళులు, ముతరాయలు, మరాఠాలకు రాజధానిగా సేవలందించింది. అప్పటి నుండి తంజావూర్ దక్షిణ భారత దేశంలోని ముఖ్యమైన రాజకీయ, సాంస్కృతిక మత కేంద్రాలలో ఒకటిగా పేరొందింది. క్రీస్తు శకం 1010లో రాజరాజు చోళ నిర్మించిన బృహదేశ్వర ఆలయానికి తంజావూర్ ప్రసిద్ధి చెందింది. ఈ అతిపెద్ద ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కూడా గుర్తింపు పొందింది. తమిళనాడు పర్యాటక రంగంలో ఈ ఆలయానికి గొప్ప ప్రాముఖ్యత ఉంది.
తంజావూరులో మొత్తం 74 దేవాలయాలు ఉన్నాయి. వీటిలో చాలా అద్భుతమైంది శ్రీ బృహదేశ్వర ఆలయం. ఈ ఆలయం తమిళనాడులోని పురాతన ఆలయాలలో ఒకటి. ఇది తంజావూరులోని ప్రధాన పర్యాటక ఆకర్షణల్లో ప్రముఖమైనది. చోళ శక్తి చిహ్నమైన ఈ అతిపెద్ద ఆలయం 1,30,000 టన్నుల గ్రానైట్ తో నిర్మించబడిన ప్రపంచంలోనే మొట్ట మొదటి శివాలయంగా గుర్తింపు పొందింది.
అంతేకాకుండా ఇది దక్షిణ భారత దేశంలోని అత్యంత అద్భుతమైన నిర్మాణాల్లో ఒకటి. ఈ ఆలయ గోపురం 66 మీటర్ల ఎత్తు, 80 టన్నుల భారీ రాతిని కలిగి ఉంది. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఆ ఆలయ గోపురం నీడ ఎప్పుడూ నేల మీద పడదు. మధ్యాహ్న సమయంలో కూడా ఇక్కడ నీడ కనిపించడం జరగదు. ఆలయ గోడలపై భరతనాట్యం భంగిమలో 108 శిల్పాలు, ప్రాంగణంలో 250 లింగాలు ఉన్నాయి. తంజావూరు పర్యటనకు వెళ్లిన పర్యాటకులు తంజావూరు బృహదీశ్వరాలయం ఆలయాన్ని తప్పక సందర్శిస్తుంటారు. అంతట చరిత్ర మరెంతో మహిమ కలిగిన ఆలయమది.