టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఇంట్లో సీసీఎస్ పోలీసులు సోదాలు నిర్వహించారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14 బీఎన్‌రెడ్డి కాలనీలోని రవిప్రకాశ్ ఇంట్లో ముసద్దీలాల్ జ్యువెల్లరీస్ అధినేత సుకేశ్ గుప్తా తలదాచుకున్నట్లు అందిన సమాచారం మేరకు ఈ దాడులు జరిపారు. సుకేశ్ గుప్తాపై ఎస్‌ఆర్‌ఈఐ ఎక్విప్‌మెంట్ ఫైనాన్స్ లిమిటెడ్ అసోసియేట్ వైస్‌ప్రెసిడెంట్ వేణుగోపాల్ ఫిర్యాదు చేశారు. దీంతో పక్కా సమాచారం మేరకు భారీ బందోబస్తు ఏర్పాటుచేసి సుకేశ్ గుప్తాను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
బషీర్‌బాగ్ కేంద్రంగా పనిచేసే ఆశీ రియల్టర్‌కు చెందిన సుకేశ్‌గుప్తా, నీతూగుప్తా, నిహారిక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సురేశ్‌కుమార్, రవిచంద్రన్‌లు ఎస్‌ఆర్‌ఈఐ వద్ద రూ.110 కోట్ల రుణం కోసం 2018 జూన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఆ దేడాది అక్టోబర్ నుంచి ప్రతి 3 నెలలకు ఓ వాయిదా చొప్పున చెల్లిస్తూ మొత్తం 4 దఫాల్లో రుణం వడ్డీ సహా తీర్చాలన్నది ఒప్పందం.
ఈ రుణానికి సంబంధించి షూరిటీగా హఫీజ్‌పేటలో ఉన్న 8 ఎకరాల స్థలంతో పాటు, కింగ్‌కోఠిలో 28,106 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న నజ్రీబాగ్ ప్యాలెస్‌ను చూపిస్తూ ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఆ రుణం చెల్లించడంలో విఫలం కావడంతో గతేడాది డిసెంబర్‌లో హఫీజ్‌పేటలోని స్థలాన్ని వేలం వేసిన ఎస్‌ఆర్‌ఈఐ సంస్థ 102.6 కోట్లు రాబట్టుకుంది. .