రేవంత్ మీద ముప్పేట దాడి… ఆ కేసు విషయంలోనే…!

IT Raids On Congress Leader Revanth Reddy House

తెలంగాణలో ముందస్తు వేడి ఊపందుకోగా, మరి కొద్ది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఇలాంటి కీలక సమయంలో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి నివాసంలో ఆదాయపు పన్ను శాఖ, ఈడీ ఆకస్మిక దాడులు నిర్వహించాయి. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసం సహా కొడంగల్‌లోని ఆయన నివాసాలలో ఉదయం నుంచి ముమ్ముర సోదాలు కొనసాగుతున్నాయి. రేవంత్ రెడ్డి‌తోపాటు ఆయన బంధువుల ఇళ్లలో మొత్తం 15 చోట్ల అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రేవంత్ కుటుంబసభ్యుల మొబైల్స్ స్వాధీనం చేసుకున్న అధికారులు, దాడుల గురించి సమాచారం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఓటుకు నోటు కేసులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈ సోదాలు నిర్వహిస్తోన్నట్టు తెలుస్తోంది.
ఓటుకు నోటు వ్యవహారంలో నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్‌కు ఇచ్చేందుకు తీసుకొచ్చిన రూ.50 లక్షలు ఎక్కడ నుంచి తీసుకొచ్చేరనే కోణంలోనే ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. రేవంత్ రెడ్డికి ఐటీ గతంలోనూ నోటీసులు జారీచేసినా ఆయన దీనికి స్పందించలేదు.

ravanth-reddy

దీంతో కేంద్ర హోంశాఖకు తెలంగాణ ఏసీబీ లేఖ రాయడంతో ఈడీ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. మరోవైపు, రేవంత్ రెడ్డి, ఓ మౌలిక సదుపాయల సంస్థ మధ్య గత ఆరు నెలల్లో కోట్లాది రూపాయలు లావాదేవీలు జరిగినట్టు ఈడీ గుర్తించినట్టు తెలుస్తోంది. ఐటీ, ఈడీ దాడుల విషయం తెలుసుకున్న రేవంత్ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు కొండగల్‌లోని ఆయన నివాసానికి భారీగా చేరుకుంటున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. రేవంత్ రెడ్డి ఇంట్లో లేని సమయంలో ఈ సోదాలేంటని, రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సోదాలకు వచ్చారని ఆయన అభిమానులు విమర్శిస్తున్నారు. టీఆర్ఎస్ సర్కార్ కక్షసాధింపు చర్యలు పాల్పడుతోందని, ఉద్దేశకపూర్వకంగానే ఈ దాడులు చేయిస్తోందని ఆరోపించారు. కేసీఆర్‌కు ప్రత్యామ్నాయంగా ఉన్న నేతల్ని కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారని వారు మండిపడుతున్నారు.

it-rides-revanth-reddy