టెన్నిస్‌ క్రీడాకారులకు ఆర్థిక సహాయం అందజేయనున్న ఐటిఎఫ్

టెన్నిస్‌ క్రీడాకారులకు ఆర్థిక సహాయం అందజేయనున్న ఐటిఎఫ్

కరోనా నేపథ్యంలో సింగిల్స్, డబుల్స్‌ విభాగాల్లో తక్కువ ర్యాంకుల్లో ఉన్న టెన్నిస్‌ క్రీడాకారులకు ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య  ప్రకటించింది. జాతీయ క్రీడా సమాఖ్యల ద్వారా అర్హులైన ఆటగాళ్లకు ఈ సహాయ నిధిని అందిస్తామని చెప్పింది. సింగిల్స్‌లో 500–700 మధ్య… డబుల్స్‌లో 175–300 మధ్య ర్యాంక్‌ ఉన్న ఆటగాళ్లను అర్హులుగా పేర్కొంది. ‘ఇదేం పెద్ద మొత్తం కాదు. ఒక్కో ఆటగాడికి 2000 డాలర్లు లభించవచ్చు. జాతీయ సమాఖ్యలు అర్హులైన క్రీడాకారులను ఎంపిక చేసి వారికి అందజేస్తాయి’ అని ఐటీఎఫ్‌ ప్రకటించింది.

దీని ప్రకారం 12 మంది భారత క్రీడాకారులు ఈ సహాయం పొందే వీలుంది. పురుషుల సింగిల్స్‌లో మనీశ్‌ కుమార్‌ (642 ర్యాంక్‌), అర్జున్‌ ఖడే (655)…డబుల్స్‌లో సాకేత్‌ మైనేని (180), విష్ణువర్ధన్‌ (199), అర్జున్‌ ఖడే (231), విజయ్‌ సుందర్‌ ప్రశాంత్‌ (300)… మహిళల సింగిల్స్‌లో కర్మన్‌కౌర్‌ (606), సౌజన్య భవిశెట్టి (613), జీల్‌ దేశాయ్‌ (650), ప్రాంజల యడ్లపల్లి (664)… డబుల్స్‌లో రుతుజా భోస్లే (196), సానియా మీర్జా (226) ఈ సహాయం అందుకోనున్నారు. తక్కువ ర్యాంకుల్లో ఉన్న 800 మంది క్రీడాకారుల్ని ఆదుకునేందుకు ఏటీపీ, డబ్ల్యూటీఏ, గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆతిథ్య దేశాలు, అగ్రశ్రేణి క్రీడాకారులు కలిసి 60 లక్షల డాలర్ల సహాయనిధిని ఏర్పాటు చేశాయి.