Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాజీ భార్య ఇవానా తన కూతురు ఇవాంకా ట్రంప్ భవిష్యత్ గురించి ఎన్నో కలలు కంటున్నారు. ఇవాంకా ఎప్పటికైనా అమెరికా అధ్యక్షురాలు అవుతుందని ఆమె విశ్వాసం వ్యక్తంచేశారు. ట్రంప్ తో తన వైవాహిక బంధం, పిల్లలు, ఆ బంధం విచ్చిన్నం కావడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ రైజింగ్ ట్రంప్ పేరుతో పుస్తకం విడుదల చేసిన ఇవానా అప్పటినుంచి వార్తల్లో నిలుస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్యను తానే కాబట్టి… అమెరికా ప్రథమ మహిళను తానే అవుతానని వ్యాఖ్యానించి వివాదం రేకెత్తించారు ఇవానా. వైట్ హౌస్ లో ఉండడానికి ట్రంప్ ప్రస్తుత భార్య మెలానియా ఇబ్బందిపడుతోందని కూడా ఆమె విమర్శించారు.
అయితే మెలానియా ప్రతినిధులు ఈ విమర్శలను తిప్పికొట్టారు. వైట్ హౌస్ ను ట్రంప్ కు అందమైన నివాసంగా మెలానియా మార్చారని, ప్రథమ మహిళ హోదాలో చిన్నారుల సంరక్షణకోసం ఆమె పాటుపడుతోందని, అంతేకాని పుస్తకాన్ని అమ్ముకోడానికి కాదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మెలానియా ప్రతినిధుల వ్యాఖ్యల తర్వాత ఇవానా ఇక ఆ విషయాన్ని కదలించలేదు కానీ… కూతురి రాజకీయ భవిష్యత్ పై తనకున్న ఆకాంక్షలను మాత్రం వీలుచిక్కినప్పుడల్లా వ్యక్తంచేస్తున్నారు. తనకు ప్రథమ మహిళ హోదా కన్నా, ప్రథమ తల్లి హోదా బాగుంటుందని గతంలో చెప్పిన ఇవానా… తన కూతురు ఎప్పటికైనా అమెరికా అధ్యక్షపీఠాన్నిఅధిరోహిస్తుందని కలలు కంటున్నారు.
1977లో డోనాల్డ్ ట్రంప్, ఇవానా పెళ్లిచేసుకున్నారు. ముగ్గురు పిల్లల తర్వాత 1992లో వారి బంధం ముగిసిపోయింది. మార్లా మేపుల్స్ తో ట్రంప్ కున్న వివాహేతర బంధమే తమ విడాకులకు కారణమని రైజింగ్ ట్రంప్ లో రాసుకొచ్చారు ఇవానా. ఎన్నో ఏళ్ల నుంచి తాము దూరంగా ఉంటున్నప్పటికీ… తనకు, ట్రంప్ కు మధ్య బంధం అలాగే ఉందని, ఇప్పటికీ తాను ఆయనతో రెగ్యులర్ గా మాట్లాడుతూనే ఉన్నానని చెప్పారు.