Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఒక్కసారి ఓ వ్యక్తి పబ్లిక్ లైఫ్ లోకి వచ్చిన తర్వాత..ఇక ఆ వ్యక్తే కాదు…కుటుంబ సభ్యులు కూడా మీడియా దృష్టి నుంచి తప్పించుకోలేరు. ముఖ్యంగా నటీనటులు, రాజకీయవేత్తల కుటుంబ సభ్యులు లో ప్రొఫైల్ మెయిన్ టెయిన్ చేయడం చాలా కష్టం. వాళ్లకు ఇష్టమున్నా, ఇష్టం లేకపోయినా..మీడియా వారి వెంట పడుతూనే ఉంటుంది. సాధారణ సెలబ్రిటీల సంగతే ఇలా ఉంటే..ఇక దేశాధ్యక్షులు, మాజీ అధ్యక్షుల ఫ్యామిలీ మెంబర్ల పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.
మీడియా అనుక్షణం వారిని వెంటాడుతూ ఉంటుంది. వారి వ్యక్తిగత జీవితాన్ని బహిరంగం చేస్తుంటుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కుమార్తె మలియా కూడా ఇప్పుడు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితినే ఎదుర్కొంటోంది. మలియాపై ఇటీవల అమెరికా మీడియాలో వివాదాస్పద వార్తలొచ్చాయి. మలియా ఒబామా పొగ తాగుతున్నట్టు, ఓ యువకుడిని ముద్దు పెట్టుకుంటున్నట్టు ఉన్న ఫొటోలు కొన్ని పత్రికల్లో ప్రచురితమయ్యాయి. నిజానికి అమెరికాలో టాబ్లాయిడ్ కల్చర్ తక్కువే. అధ్యక్షులు, మాజీ అధ్యక్షుల పిల్లల వ్యక్తిగత జీవితాలపై వార్తలు ఇచ్చేందుకు అక్కడి మీడియా ఆసక్తి చూపదు.
మలియా విషయంలో మాత్రం మీడియా ఇందుకు విరుద్ధంగా వ్యవహరించింది. ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అధికారిక కార్యక్రమాల్లో మాత్రమే ఒబామా పిల్లలు కనిపిస్తుండేవారు. అంతకు సంబంధించి వారి గురించిన విశేషాలేమీ మీడియాలో వచ్చేవికాదు. ఆలాంటిది ఆయన పదని నుంచి దిగిపోయిన తర్వాత మాత్రం మీడియా మలియా వెంట పడడం అందరినీ ఆశ్యర్చ పరుస్తోంది. అటు మీడియా వైఖరిపై మాజీ, ప్రస్తుత అధ్యక్షుల కుమార్తెలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మలియాకు మద్దతుగా ట్వీట్లు చేశారు.
మలియాకు వ్యక్తిగత జీవితం ఉంటుందని, అది మీడియాకు అనవసరమని అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కుమార్తె చెల్సియా వ్యాఖ్యానించారు. మలియా ఒబామా ఇప్పుడు ఒక ప్రయివేట్ సిటిజన్ అని ఆమె జీవితానికి ప్రైవసీ ఉంటుందని ఇవాంకా అభిప్రాయపడ్డారు. మీడియా పరిమితుల్లో ఉండాల్సిన అవసరం ఉందని ట్వీట్ చేశారు. చెల్సియా కూడా ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తంచేశారు. ఒక యువతిగా, కాలేజీ విద్యార్థినిగా, ప్రయివేట్ సిటిజన్ గా మలియా ఒబామాకు వ్యక్తిగత జీవితం ఉంటుందని, అది మీడియా ప్రజల దృష్టిని ఆకర్షించడానికి కాదని చెల్సియా ట్వీట్ చేశారు. కాస్త ఉన్నతంగా ఉండాలని ఆమె మీడియాకు సూచించారు.