Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఇన్నోవేషన్ హబ్ గా హైదరాబాద్ ఎదుగుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, వైట్ హౌస్ సలహాదారు ఇవాంకా ట్రంప్ ప్రశంసించారు. హైదరాబాద్ హైటెక్స్ లోని హెచ్ ఐసీసీలో ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సును భారత ప్రధాని నరేంద్రమోడీతో కలిసి ప్రారంభించిన తరువాత ప్రతినిధులనుద్దేశించి ఆమె సుదీర్ఘంగా ప్రసంగించారు. 150 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు శుభాకాంక్షలు చెప్పారు. ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటన్నారు. వైట్ హౌస్ కు భారత్ నిజమైన మిత్రుడని అమెరికా అధ్యక్షుడు అంటుంటారని ఇవాంకా తెలిపారు. కొత్త ఆవిష్కరణలతో వస్తున్న ఔత్సాహికులు విప్లవాత్మకమైన మార్పులు తెస్తున్నారని ఇవాంకా అన్నారు. జీఈఎస్ లో 52శాతం మహిళలు పాల్గొనడం తనకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. పురుషాధిక్య సమాజంలో రాణించడానికి మహిళలు మరింత కష్టపడాలని తాను తెలుసుకున్నానన్నారు. గత పదేళ్లలో మహిళా పారిశ్రామికవేత్తల సంఖ్య పదిశాతం పెరిగిందని తెలిపారు. అమెరికాలో కోటీ 10లక్షలమంది మహిళా పారిశ్రామిక వేత్తలు ఉన్నారని చెప్పారు. యువ పారిశ్రామిక వేత్తలుగా విజయవంతమైన ముగ్గురు మహిళలను ఇవాంకా ప్రత్యేకంగా పేర్లు పెట్టి పిలిచి, వారికి సదస్సులో పాల్గొన్న వారందరితో అభినందలు తెలియజేశారు. ఒక్క మహిళ నిలబడితే కుటుంబం, సమాజం, వ్యవస్థలు నిలబడతాయని ఇవాంకా అన్నారు. తండ్రి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడయిన తర్వాత ఆయనకు సహాయ సహకారాలు అందించేందుకు వ్యాపారాలు పక్కనపెట్టి వచ్చానని చెప్పారు. ప్రధానమంత్రి మోడీపై ఇవాంకా ప్రశంసల జల్లు కురిపించారు.
మోడీ ఆధ్వర్యంలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. టీ అమ్మే స్థాయి నుంచి ప్రధానిగా ఎదిగిన మోడీ ప్రస్థానం భారతీయ నిపుణులకు స్ఫూర్తిదాయకమన్నారు. మహిళా సాధికారత లేకుండా అభివృద్ధి సాధ్యం కాదన్న మోడీకి ధన్యవాదాలు తెలిపారు. చాలా దేశాల్లో మహిళలు సామాజిక అవరోధాలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. భాగ్య నగరం గురించి తన ప్రసంగంలో ఇవాంకా ప్రధానంగా ప్రస్తావించారు. ప్రపంచ ప్రఖ్యాత బిర్యానీకి హైదరాబాద్ పుట్టినిల్లని, ముత్యాల నగరంలో యువతే గొప్ప సంపదని ఇవాంకా కొనియాడారు.
అంతకుముందు పారిశ్రామిక సదస్సులో భాగంగా ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్ ను ప్రధాని మోడీతో కలిసి ఇవాంకా సందర్శించారు. సదస్సు ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పురాతన కాలం నుంచి భారతదేశం విద్య, వైజ్ఞానిక, అంతరిక్ష, జ్యోతిష్య, బయో టెక్నాలజీ రంగాల్లో ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచిందని వివరిస్తూ ఓ వీడియో ప్రదర్శించారు. నృత్యరూపానికి టెక్నాలజీ జతచేసిన ఈ వీడియో ఆహుతులను విశేషంగా అలరించింది. తర్వాత సదస్సుకూడా వినూత్నంగా ప్రారంభమయింది. వ్యాఖ్యాత ఇంగ్లీషులో సదస్సును ప్రారంభించాల్సిందిగా ప్రధానిని, ఇవాంకాను కోరారు. అప్పుడు బెంగళూరుకు చెందిన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు తయారుచేసిన మిత్రా అనే రోబో ప్రధాని, ఇవాంకా ముందుకు వచ్చింది. మిత్రా స్క్రీన్ కు ఉన్న భారత్ ఫ్లాగ్ బటన్ ను మోడీ, అమెరికా ఫ్లాగ్ బటన్ ను ఇవాంకా ప్రెస్ చేయగానే సదస్సు ప్రారంభమైనట్టు స్క్రీన్ పై దృశ్యం కనిపించింది. ఇవాంకా రోబో వంక నవ్వుతూ చూసి సరదాగా మరోసారి ప్రెస్ చేశారు. అనంతరం రోబో అక్కడినుంచి వెళ్లిపోయింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు నిమిషాలు ప్రారంభోపన్యాసం చేశారు.