శర్వానంద్ హీరోగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతా హీరోయిన్ గా సి ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఎమోషనల్ లవ్ డ్రామా చిత్రం “జాను”. తమిళ్ లో విజయ్ సేతుపతి హీరోగా త్రిష హీరోయిన్ గా తెరకెక్కిన “96” చిత్రానికి రీమేక్ తెరకెక్కిన “జాను” చిత్రం అంతే హైప్ తో టాలీవుడ్ నుంచి విడుదలయ్యింది.మరి ఈ చిత్రం ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో ఇప్పుడు రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం.
కథలోకి వెళ్లినట్టయితే రామ్(శర్వానంద్) ఓ వైల్డ్ లైఫ్ ఫోటో గ్రాఫర్.కొన్ని పరిస్థితుల రీత్యా తాను చదువుకున్న స్కూల్ దగ్గరకు వెళ్లాల్సి వస్తుంది.ఈ నేపథ్యంలో తన చిన్ననాటి స్నేహితులు అంతా కలిసి ఒక గెట్ టు గేదర్ ను ఏర్పాటు చెయ్యగా అక్కడికి జాను(సమంత)కూడా వస్తుంది.ఒకప్పుడు ఒకే క్లాస్ స్కూల్ కు చెందిన జాను మరియు రామ్ ల మధ్య జరిగిన స్టోరీ ఏమిటి? వారు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది.చాలా కాలం తర్వాత కలిసిన వీరిద్దరికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి?అప్పుడు ప్రేమించుకున్న వీళ్ళ ప్రేమకు ముగింపు ఎలా వచ్చింది?వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఏ స్థాయిలో ఆకట్టుకుంది అన్నది తెలియాలి అంటే ఈ ఎమోషనల్ లవ్ డ్రామాను వెండితెర మీద చూడాల్సిందే.
తమిళ్ లో 96 గా విడుదల కాబడిన ఈ చిత్రం అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.మంచి ఎమోషనల్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి రీమేక్ గా తెలుగులో కూడా మంచి అవుట్ ఫుట్ ఇచ్చే ప్రయత్నమే ఈ “జాను”. ముఖ్యంగా ఆల్రెడీ ఎమోషనల్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం మన దగ్గర కూడా అదే దర్శకుడితో ప్లాన్ చెయ్యడం మూలాన సినిమా ఫలితాన్ని అందుకోకుండా ఉంటుంది అనుకోలేం.ఎలాగో ఫలితం ఒకేలా ఉంటుంది కానీ దానిని మన నేటివిటీకి తగ్గుట్టుగా ఎలా తెరకెక్కించారు అన్నది ప్రశ్న.
అలా ఈ చిత్రం మన నేటివిటీకి తగ్గుట్టుగా దర్శకుడు సి ప్రేమ్ కుమార్ తెరకెక్కించారు.ఇప్పటికే 96 చిత్రాన్ని చూసేసిన వారికి ఈ సినిమా పెద్ద గొప్పగా అనిపించకపోవచ్చు.ఎందుకంటే చాలా మంది ఈ రీమేక్ కూడా బాగున్నా దాని ఒరిజినల్ వెర్షన్ వైపే మొగ్గు చూపుతారు.కానీ తమిళ్ లో ఈ చిత్రాన్ని కానీ ఫాలో అవ్వని వారికి “జాను” ఖచ్చితంగా ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది.ముఖ్యంగా శర్వా మరియు సమంతల పెర్ఫామెన్స్ విషయానికి వస్తే కథ మొత్తం వీరి మీదనే నడుస్తుంది.
వీరిద్దరి మధ్య వచ్చే కొన్ని లవ్ ట్రాక్స్ మరియు ఎమోషనల్ సన్నివేశాలు అయితే మంచి లవ్ జాన్రా సినిమాలను ఇష్టపడే వారికి ట్రీట్ లా ఉంటాయి.అంతలా వీరి కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది.అలాగే ఫ్లాష్ బ్యాక్ లోని స్కూల్ ఎపిసోడ్స్ కానీ చాలా చక్కగా వచ్చాయి.అయితే సినిమా అంతా లవ్ అనే ఎమోషన్ లో కొత్త కోణాన్ని చూపించినా అది అలా నెమ్మదిగా సాగుతున్నట్టు అనిపిస్తుంది.దీని మూలాన అక్కడక్కడా కాస్త బోర్ అనిపించొచ్చు.
పెర్ఫామెన్స్ ల పరంగా అయితే వీరిని ఎక్కడా తక్కువ చెయ్యడానికి లేదు.ఇక దర్శకుని పని తీరుకు వచ్చినట్టయితే తమిళ్ లో ఇప్పటికే తెరకెక్కించిన దర్శకునికి తెలుగులో కూడా అదే స్థాయి అవుట్ ఫుట్ ను రాబట్టడం పెద్ద కష్టమేమి కాదు.అలాగే తనకు కావాల్సింది అంతా రాబట్టుకున్నారు.ఎమోషన్స్, కెమిస్ట్రీ, నటన ఇలా అన్ని కోణాల్లోనూ సినిమాకు తగ్గట్టుగా రాబట్టేసారు.
అయితే తెరకెక్కించిన విధానంలో ఇంకా కొన్ని మేజర్ గా కాకపోయినా చిన్న మార్పులు చేసి ఉండాల్సింది.సినిమా సోల్ ను దెబ తియ్యకుండా చేసిన ప్రయత్నంలో కథనాన్ని నెమ్మదిగా కాకుండా చిన్నగా స్పీడప్ చేస్తే బాగుండేది.అలాగే మహేందిరన్ జయరాజు అందించిన సినిమాటోగ్రఫీలోని మ్యాజిక్ శర్వాను పరిచయం చేసిన ఫస్ట్ షాట్ తోనే మొదలవుతుంది.అలాగే గోవింద్ వసంత అందించిన పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సినిమాకు మరింత జీవం పోశాయి.
ఇక మొత్తంగా చూసుకున్నట్టయతే శర్వానంద్ మరియు సమంతల కాంబోలో ప్రేమ్ కుమార్ తెరక్కించిన ఎమోషనల్ లవ్ డ్రామా “జాను” ఆకట్టుకునే లవ్ ట్రాక్,ప్రధానపాత్రదారుల మధ్య కెమిస్ట్రీ మరియు ఎమోషన్స్ తో ఇప్పటి వరకు దీని ఒరిజినల్ వెర్షన్ “96”ను చూడని వారికి మాత్రం తప్పకుండా ఒక మంచి ఫ్రెష్ అనుభూతిని కలిగిస్తుంది.అలాగే కాస్త నెమ్మదిగా సాగే కథనం ఒరిజినల్ వెర్షన్ నుంచి బయటకు రాని వారికి అయితే అంత గొప్పగా అనిపించకపోవచ్చు.