హీరోలతో సమానంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న కథానాయిక సమంత. ఆమె నుంచి కొన్నేళ్లుగా చాలా ప్రత్యేకమైన సినిమాలొస్తున్నాయి. ఇప్పుడు రాబోయే ‘జాను’ కూడా అలాంటిదే. తమిళంలో క్లాసిక్‌గా పేరు తెచ్చుకున్న ‘96’కు తెలుగు రీమేక్ ఇది. ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొస్తోన్న ఈ చిత్రాన్ని చూసేందుకు వచ్చేవాళ్లంతా హ్యాండ్ కర్చీఫ్‌లు కచ్చితంగా తెచ్చుకోవాలని అంటోంది సమంత.
సినిమా అంత ఎమోషనల్‌గా ఉంటుందని, ఎలాంటి వ్యక్తినైనా కదిలిస్తుందని.. కన్నీళ్లు పెట్టిస్తుందని.. కాబట్టి కర్చీఫ్‌లు కచ్చితంగా తెచ్చుకోవాల్సిందే అని ఆమె తేల్చి చెప్పింది. ‘జాను’ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. తమిళంలో ‘96’ సినిమా చూసినా కూడా పర్వాలేదని.. అయినా కూడా ‘జాను’ కూడా చూడొచ్చు. అదే కథలో కొత్త మ్యాజిక్ జరిగిందని సమంత అభిప్రాయపడింది.
ఈ సినిమా చేయడానికి ముందు తాను బాగా భయపడ్డమాట నిజమే అని.. ఇలాంటి క్లాసిక్ రీమేక్‌లో నటించకూడదని అనుకున్నానని.. సినిమాకు నో కూడా చెప్పానని.. కానీ దిల్ రాజు తనను కన్విన్స్ చేసి ఈ సినిమా చేయించారని.. ఈ రోజు తన టాప్-3 ఫిలిమ్స్‌లో ‘జాను’ ఒకటని తాను నమ్మకంగా చెబుతున్నానని.. ఇలాంటి సినిమాను తనతో చేయించినందుకు రాజుకు రుణపడి ఉంటానని సమంత అంది.
ఈ సినిమా తొలి రోజు షూటింగ్‌లో పాల్గొన్నపుడే తనకు నమ్మకం కుదిరిందని.. ఏదో మ్యాజిక్ ఉందనిపించిందని ఆమె చెప్పింది. దేవుడికి తాను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలని.. ప్రతి సంవత్సరం ఏదో ఒక స్పెషల్ మూవీ ఇస్తూనే ఉన్నాడని.. ఈ ఏడాదికి ‘జాను’ అలాంటి చిత్రమే అని.. ఈ సినిమా తన హృదయంలో చాలా ఏళ్లు నిలిచిపోతుందని.. చాలా సింపుల్‌గా అనిపిస్తూనే ప్రతి ఒక్కరినీ కదిలించే సినిమా అని.. తాను ఈ సినిమాలో ఎమోషనల్ సీన్లు చేసిన ప్రతిసారీ గ్లిజరిన్ లేకుండానే కన్నీళ్లు పెట్టుకున్నానని.. పది టేక్‌లు తీసుకుంటూ పది సార్లు గ్లిజరిన్ లేకుండా నిజంగానే కన్నీళ్లు వచ్చాయని సమంత తెలిపింది. ఇదంతా ప్రేమకున్న శక్తి అని.. పదేళ్ల కెరీర్లో శర్వానంద్‌తో తాను ఒక్క సినిమా కూడా చేయలేదని.. అతడితో చేయడానికి ‘జాను’ కంటే మంచి సినిమా మరొకటి దొరకదని సమంత అంది.