ఐరన్ లెగ్ గా మారిన బాలీవుడ్ సీనియర్ నటుడు

ఐరన్ లెగ్ గా మారిన బాలీవుడ్ సీనియర్ నటుడు

సినీ రంగంలో సెంటిమెంట్ల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు.హీరోయిన్ కెరీర్ ఆరంభంలో చేసిన రెండు మూడు సినిమాలు పోయాయంటే ఐరెన్ లెగ్ ముద్ర వేసేస్తారు.శ్రుతి హాసన్ విషయంలో ఇలాగే జరగడం గుర్తుండే ఉంటుంది. హీరోయిన్లనే కాదు.. క్యారెక్టర్ ఆర్టిస్టులు, విలన్ల విషయంలోనూ ఇలాంటి సెంటిమెంట్లను నమ్ముతుంటారు సినీ జనాలు. ఇలాంటి బలమైన ముద్ర వేయించుకున్న నటుల్లో బాలీవుడ్ సీనియర్ ఆర్టిస్టు జాకీష్రాఫ్ ఒకడు. హిందీలో అతడికి హిట్లున్నాయి కానీ.. దక్షిణాదిన మాత్రం జాకీ ట్రాక్ రికార్డు ఘోరం.

మంచు విష్ణుతో కలిసి చేసిన ‘అస్త్రం’, ఎన్టీఆర్ మూవీ ‘శక్తి’..పవన్‌ కళ్యాణ్‌తో నటించిన ‘పంజా’ ఇలా తెలుగులో జాకీ చేసిన సినిమాలన్నీ డిజాస్టర్లే. తాజాగా ‘సాహో’ సినిమాలో జాకీ చేసింది చిన్న పాత్రే అయినా.. ఆ సినిమా కూడా నిరాశాజనకమైన ఫలితాన్నందుకోవడంతో ఆయనపై ఐరెన్ లెగ్ ముద్ర పడిపోయింది. తమిళంలో సైతం జాకీకి ఇలాంటి రికార్డే ఉంది. ఆయన నటించిన ‘ఆరణ్యకాండ’ గొప్ప సినిమాగా పేరు తెచ్చుకున్నా కమర్షియల్‌గా సక్సెస్ కాలేదు. అక్కడి వాళ్లు కూడా ఆయన్ని ప్రతికూల కోణంలో చూస్తున్నారు.

ఇప్పుడాయన విజయ్ నటించిన భారీ చిత్రం ‘బిగిల్’లో ఓ కీలక పాత్ర చేశాడు. ఈ సినిమా ట్రైలర్లో జాకీ కనిపించడం ఆలస్యం.. సోషల్ మీడియా జనాలు అలెర్టయిపోయారు. పాపం విజయ్ అంటూ మీమ్స్ తయారు చేశారు. ముఖ్యంగా తెలుగు వాళ్లే ఈ మీమ్స్ ఎక్కువ రూపొందిస్తున్నారు. జాకీ ఎఫెక్టేంటో మాకు తెలుసు.. ఇప్పుడు కోలీవుడ్ వాళ్లు కూడా చూస్తారు అంటూ కామెడీ చేస్తున్నారు. మరి ఈ సినిమా అయినా అంచనాలకు తగ్గట్లు ఆడి జాకీ మీద పడ్డ నెగెటివ్ ముద్రను చెరిపేస్తుందేమో చూడాలి.