ఏపీలో ఇప్పటివరకూ మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నెల్లూరు, ప్రకాశం, విశాఖలో ఒక్కొక్కటి చొప్పున మూడు కేసులు నమోదయ్యాయి. నిన్న విశాఖలో కరోనా బాధితుడు చనిపోయాడంటూ ప్రముఖ న్యూస్ ఛానెళ్లలో, వెబ్ మీడియాలో వదంతులు వైరల్ అయ్యాయి. దీంతో సీఎం జగన్ మీడియా విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం కరోనాపై మీడియా పాటించాల్సిన కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. పత్రికలు, న్యూస్ ఛానెళ్లు, ఎడిటర్లు, రిపోర్టర్లు, బ్యూరో చీఫ్ లు కచ్చితంగా మార్గదర్శకాలను పాటించాలని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి నిన్న ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.
ప్రభుత్వం ఈ ప్రకటనలో వైద్య, ఆరోగ్య శాఖ నిర్ధారించిన సమాచారాన్ని మాత్రమే పత్రికలు, టీవీలు పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. పాజిటివ్ కేసులు, మరణాల విషయంలో అధీకృత సమాచారం లేకుండా ప్రచురించరాదని సూచించింది. అనుమానిత కేసుల పేరుతో సమాచారం ప్రసారం చేయరాదని… పాజిటివ్ కేసుల్లో బాధితుల, పేర్లు, చిరునామాలు ప్రసారం చేయరాదని సూచించింది. కరోనాకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించే వెబ్ సైట్ల నుంచి మాత్రమే తీసుకోవాలని సూచించింది. కరోనా నివారణ, ప్రజలకు అవగాహన కల్పించడంలో ప్రసార మాధ్యమాల సహకారాన్ని కోరుతున్నామని తెలిపింది. ఏపీలో ప్రభుత్వం తీసుకుంటున్న ముందుజాగ్రత్త చర్యల వల్ల కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు కావడం లేదు.