జగన్ క్లారిటీ ఇచ్చేశారుగా !

Jagan Gives Clarity On Federal Front

ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ కి పరోక్షంగా, గుట్టుచప్పుడు తాకకుండా టీఆర్ఎస్ మద్దతిస్తోందని జనాల్లో ఉన్న టాక్ నిజమే అని తాజాగా జగన్ ఇచ్చిన స్టేట్ మెంట్ తో అందరికీ తేటతెల్లం అయ్యింది. కేసీఆర్‌కి పదిహేడు మంది ఎంపీలు ఉన్నారు. మనకు 25 మంది ఎంపీలున్నారు. 42 మంది కలిసి హోదాకు మద్దతు తెలుపడానికి ఎవరైనా సంతోషిస్తారు. కానీ చంద్రబాబు మాత్రం నీచ రాజకీయాలు చేస్తున్నారంటూ జగన్ ప్రకటన చేశారు. ఏపీ తెలంగాణకు కలిసి 42 సీట్లు అవుతాయి. వాటి ద్వారా తాము ప్రత్యేకహోదా తీసుకు వస్తామన్న అర్థం జగన్ ట్వీట్ లో స్పురిస్తోంది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలనే ప్రయత్నాల్లో కేసీఆర్.. బయటెక్కడా సక్సెస్ కాకపోయినా ఏపీలో మాత్రం సఫలమవుతున్నారు. వైసీపీని మిత్రపక్షంగా చేసుకోవటం, దానికి జగన్ సాహో అనటమే దీనికి ఉదాహరణ. ముందుగా ఇది మీడియా ప్రకయన ఇచ్చి ఊరుకున్నా ప్రజల్లో వచ్చే స్పందనను బట్టి జగన్ తన వాదనను తన మీడియా ద్వారా మరింత బలంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తోందని తెలుస్తోంది.

మరోవైపు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ప్రత్యేకంగా ప్రెస్‌మీట్ పెట్టి… ఏపీకి ప్రత్యేకహోదా కోసం తాను అడ్డుపడటం లేదని, గతంలో తాను, కేకే, కవిత పార్లమెంట్‌లో మద్దతు ప్రకటించామని కూడా చెప్పుకురావటం, తన నిజాయితీని నిరూపించుకునేందుకు.. అవసరం అయితే.. ఇప్పుడు ప్రత్యేకహోదా కోసం.. మోడీకి లేఖ రాస్తానని కూడా అనటం ఏపీ ప్రజల్లో కొత్త ఆలోచనలు రేకెత్తిస్తోంది. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తే తెలంగాణ నష్టపోతుందని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారో అందరికీ సింపుల్‌గా అర్థమైంది. ప్రత్యేకహోదా అనే కండిషన్‌ను అడ్డంగా పెట్టుకున్న జగన్‌ను ఫెడరల్‌ ఫ్రంట్‌లోకి తీసుకు రావడానికే కేసీఆర్ ఇలా మాట్లాడుతున్నారని చాలా మందికి ఇప్పటికే ఓ అంచనా వచ్చేసింది.