Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అనుభవం అయితే గానీ తత్వం బోధపడదు. ఈ నానుడి అందరికీ తెలిసిందే. అనుభవం అయినా కూడా తత్వం బోధపడని వాళ్ళు కూడా వుంటారు. ఈ విషయం తలపండిన వాళ్లకి కూడా స్ఫురించలేదేమో .అందుకే అలాంటి వాళ్ళ మీద ఓ సామెత చెప్పడం మర్చిపోయినట్టున్నారు. ఇంతకీ ఇదంతా ఎవరికి వర్తిస్తుంది అనుకుంటారా… ఇంకెవరికి ? వైసీపీ అధినేత జగన్ కి. అదెలాగో చూద్దాం. 2014 ఎన్నికల్లోవైసీపీ ఓటమి పాలైంది. ఆ ఓటమి అనూహ్యమే. అంతకుముందు జరిగిన ఉపఎన్నికలు చూసినవాళ్ళకి సార్వత్రిక ఎన్నికల ఫలితం పెద్ద షాక్. ఎన్నికలకి ఓ నెల ముందు కూడా జగన్ గెలుపు నల్లేరు మీద నడక అనుకున్నారు. పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీ కూటమికి మద్దతు పలకడంతో చివరిలో సీన్ ఎలా మారిపోయిందో చూసాం. ఇక ఆ ఫలితం అనుభవించిన జగన్ కి పవన్ రోల్ ఎంత షాక్ కలిగించివుండాలి?. కానీ అదేమీ లేదట. ఈ విషయం ఇంకెవరో చెబితే పర్లేదు. సాక్షాత్తు జగన్ ఇటీవల తనని కలిసిన జర్నలిస్టులకి చెప్పారు. డీటెయిల్స్ లోకి వెళితే …
ఇటీవల తన పాదయాత్ర కి మద్దతు కోరుతూ వివిధ మీడియా సంస్థల ప్రతినిధులతో జగన్ భేటీ అయిన విషయం తెలిసిందే. ఆ భేటీలో ఓ విలేకరి టీడీపీ విషయం సరే, కొత్తగా ఎన్నికల బరిలోకి దిగుతున్న జనసేనని నిలువరించడానికి ఏ వ్యూహాలు అనుసరిస్తారు అని అడిగారట. ఆ ప్రశ్నకి వచ్చిన సమాధానం చూసి అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. పవన్ తో నో ప్రాబ్లెమ్ అని జగన్ అనగానే ఇదేదో లోపాయికారీ ఒప్పందం ఉందేమో అనుకున్నారు. అయితే దానికి కొనసాగింపుగా పోటీ వైసీపీ,టీడీపీ మధ్యే ఉంటుంది తప్ప జనసేన ని జనం పట్టించుకోరని జగన్ వ్యాఖ్యానించారు. దాంతో పాటు వచ్చే ఎన్నికల్లో తాను గెలిచి సీఎం అవుతానని కూడా జగన్ అనడంతో అంతా అవాక్కు అయ్యారట. ఒక్కసారి పవన్ చేతుల్లో చావుదెబ్బ తిని కూడా ఆయన్ని లైట్ తీసుకుని జగన్ పెద్ద తప్పు చేస్తున్నారని అక్కడున్న వారికి అర్ధం అయ్యింది. ఒక్క జగన్ కి తప్ప. ఆ విషయాన్ని జగన్ తో చెప్పేందుకు ఏ ఒక్క జర్నలిస్ట్ ఆసక్తి చూపలేదు.