టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వేస్తున్న అడుగులు ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఏమాత్రం మింగుడుపడ్డంలేదు. రాహుల్‌తో బాబు భేటీకి సంబంధించి జగన్ తన అనుయాయులతో సుధీర్ఘ మంతనాలే జరిపారట. తాను ఊహించిందే జరిగిందని.. చంద్రబాబు మామూలోడుకాదని జగన్ సన్నిహితుల దగ్గర విశ్లేషించినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. బాబు-రాహుల్ మైత్రి అంశంపై సీరియస్ గా దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని కూడా జగన్ తన అనుయాయుల దగ్గర అన్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో విజయం చేజిక్కించుకోవాలంటే, ఇప్పటినుంచే ఆచి తూచి అడుగువేయాలని, లేదంటే 2014 ఎన్నికల్లో ఎదురైన పరిస్థితే 2019 సాధారణ ఎన్నికల్లోనూ పునావృతమవుతుందని కూడా జగన్ వ్యాఖ్యానించినట్టు సమాచారం. గత సాధారణ ఎన్నికల్లో వైసీపీని చంద్రబాబు ఎలా ఒంటరిని చేసిందీ జగన్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారట. చంద్రబాబు ఆ ఎత్తుగడే మనకొంపముంచిందని బీజేపీ, జనసేనతో జోడీకట్టి పీఠం ఎక్కేసిన చంద్రబాబు, ఇప్పుడుకూడా తనవైన తెలివితేటలతో ముందుకు వెళ్తారని చెప్పకొచ్చారట. మొన్నటిలా బాబు ట్రాప్ లో పడకూడదని, ఆచితూచి అందర్నీ కలుపుకుపోవడం తప్ప మనకు వేరే మార్గం కనిపించడంలేదని కూడా జగన్ వ్యాఖ్యానించినట్టు వినికిడి. పైకి బీజేపీయేతర శక్తుల కలయికకు సన్నాహాలు అని నేషనల్ కలరింగ్ ఇస్తున్నప్పటికీ చంద్రబాబు మెయిన్ టార్గెట్ ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించడమని.. అదే కాంగ్రెస్‌తో మైత్రిలోని ముఖ్య ఉద్దేశ్యమని జగన్ లెక్కలు కడుతున్నారట. దీనిలో భాగంగానే తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమితో పొత్తులంటూ కాంగ్రెస్‌కు దగ్గరయ్యారని జగన్ విశ్లేషించినట్టు తెలుస్తోంది.
తమ మిత్రపక్షంగా ఉన్న మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారుకు కాలం తీరే సమయం ఆసన్నమైందన్న విషయాన్ని సర్వేలు కట్టించుకుమరీ తీర్మానించుకున్న చంద్రబాబు.. వ్యూహాత్మకంగా అడుగులు వేసుకుంటూ వచ్చారని జగన్ చెప్పినట్టు సమాచారం. బీజేపీతో కలిసి వచ్చే ఎన్నికల్లో ప్రయాణిస్తే మన పుట్టి మునుగుతుందన్న విషయాన్ని ముందే గ్రహించిన చంద్రబాబు, పైకి ప్రత్యేక హోదా సాకు చూపించి ఎన్టీయే కుంపటి నుంచి సేఫ్ ఎగ్జిట్ ఇచ్చారని జగన్ చెప్పుకొచ్చారట. దీనికి తోడు గతఎన్నికల్లో మద్దతునిచ్చిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఊహించని రీతిలో టీడీపీకి వ్యతిరేకంగా మారడంతో చంద్రబాబు కొత్త స్ట్రాటజీ అందుకున్నారని.. వాస్తవానికి 2019 ఎన్నికలను జనసేనతో కలిసి ఎదుర్కోవాలని చంద్రబాబు భావించారని.. అది కాస్తా కుదిరేట్టు కనిపించకపోవడంతో రాహుల్ తో స్నేహం కుదుర్చుకున్నారని జగన్ అన్నార్ట. దీనికి తోడు జాతీయ స్థాయిలో దేశవ్యాప్తంగా మోదీ సర్కారుకు వ్యతిరేకంగా వీస్తున్న పవనాలు కాంగ్రెస్ కు కలిసివస్తాయని తద్వారా తమ పార్టీకి కూడా లబ్ది చేకూరుతుందన్నది చంద్రబాబు ఆలోచన అని జగన్ చెప్పారట. అంతేకాదు, జాతీయ స్థాయిలో బీజేపీయేతర శక్తులను కూడగట్టడమే మెయిన్ ఎజెండా అంటూ శరద్ పవర్, ఫరూఖ్ అబ్దుల్లా వంటి నేతలతో నిన్న భేటీలు కట్టిన చంద్రబాబు అసలు టార్గెట్ వేరని, రాహుల్ తో భేటీయే దాని అసలు ఉద్దేశ్యమని.. దేశక్షేమం కోసం అంటూ మిగతా పార్టీల నేతలతో మీటింగ్ లు, ప్రెస్ మీట్ లూ పెట్టి చంద్రబాబు ప్రజల్ని తప్పుదోవపట్టించే యత్నం చేస్తున్నారని జగన్ విశ్లేషించారట. 2014 ఎన్నికల సమయంలో మోదీమీద ఉన్న మోజును తమ పార్టీకి ఓట్లుగా మార్చుకున్న చంద్రబాబు.. ఇప్పుడు రాహుల్ మీదున్న మోజును, మోదీ మీద ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని ఎన్‌క్యాష్ చేసుకోవాలన్నది చంద్రబాబు కుటిల రాజకీయమని జగన్ చెప్పుకొచ్చారట.
ఇలా ఉంటే, నిన్న ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కసారిగా తెలుగురాష్ట్రాల్లో రాజకీయాలు కొత్త టర్న్ తీసుకున్నట్లైంది. కాంగ్రెస్ వ్యతిరేక పునాదులపై పురుడుపోసుకున్న తెలగుదేశంపార్టీ 1982లో అంకురించింది మొదలు ఏనాడూ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపింది లేదు. వామపక్షపార్టీలతో, బీజేపీతో పొత్తురాజకీయాలు నెరపిన టీడీపీ ఈ 36ఏళ్లలో ఏనాడూ కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకుని ఎన్నికలకు వెళ్లిందిలేదు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శతృవులు ఉండరన్న నానునిడిని నిజం చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొత్త మైత్రికి తెరలేపారు. 2014ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో దోస్తీకట్టి ఎన్నికలకు వెళ్లిన చంద్రబాబు కొన్ని నెలల క్రితం ఎన్డీయే నుంచి ఉపసంహరించుకున్నారు. తమ పార్టీకి చెందిన కేంద్రమంత్రుల్ని రాజీనామాలు చేయించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా అంటూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కు రాం రాం చెప్పేసిన టీడీపీ అధినేత.. ఇప్పుడు కొత్త బంధాలకు పురుడుపోశారు. ఇవి ఏమేరకు టీడీపీని ఏపీలో అధికారంలోకి తీసుకురావడానికి ఉపయోగపడతాయో.. ప్రతిపక్షనేత జగన్‌కు ఎలాంటి షాక్లిస్తాయో చూడాలి.