ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ కరోనా విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు కానీ ఈ మధ్య కాలంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు కానీ అతన్ని బాగా హైలైట్ చేసాయి. కరోనా ఎంటర్ అయిన మొదట్లో అనేక విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ వాటికి ఎదురెళ్లి అదే విమర్శలు కురిపించిన వారితో అభినందనలు రాబట్టుకున్నారు. అయితే ఆ సమయంలో మన దేశంలోనే బెస్ట్ ముఖ్యమంత్రిగా వై ఎస్ జగన్ ఆరవ స్థానంలో నిలిచినట్టుగా సర్వేలో తేలింది.
కరోనా సమయంలో సమర్ధవంతమైన చర్యలు తీసుకున్న ఉన్నత ముఖ్యమంత్రిగా అప్పుడు సత్తా చాటిన వై ఎస్ జగన్ ఈసారి మళ్ళీ టాప్ స్థానంలో నిలిచినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి వెల్లడించారు. ఇండియా టుడే లో వై ఎస్ జగన్ టాప్ పెర్ఫామింగ్ ముఖ్యమంత్రుల జాబితాలో మూడవ స్థానంలో నిలిచారని నిర్ధారించారని మన ప్రియతమ నాయకుడు ప్రజల ప్రేమతో పొందిన మరో విజయమే ఇది అని విజయసాయి రెడ్డి తెలిపారు.
దేశంలో అత్యంత ప్రజాదరణ చెందిన ముఖ్యమంత్రుల్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తొలి స్థానంలో నిలిచారు. రెండోస్థానంలో ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిలిచారు. మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలిచినట్లుగా సదరు మీడియా సంస్థ పేర్కొంది. 19 రాష్ట్రాల్లోని 97 లోక్ సభ నియోజకవర్గాల్లో ఈ సర్వేను నిర్వహించారు.
ఈ సర్వేలో కేసీఆర్ ర్యాంకు తొమ్మిదో స్థానంగా పేర్కొన్నారు. కరోనా మొదట్లో ఆయన పేరు ప్రఖ్యాతులు దేశవ్యాప్తంగా మారుమోగగా.. తర్వాతి కాలంలో ఆయన పనితీరుపై పెదవి విరుపు అంతకంతకూ ఎక్కువ అవుతోంది.