ప్రజావేదిక విషయంలో ఏపీ సీఎం చంద్రబాబుకి షాక్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అమరావతిలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి అనుబంధంగా ఉన్న ప్రజావేదికను తమకే కేటాయించాలంటూ టీడీపీ, వైసీపీలు కోరుతున్నాయి. ప్రజావేదికను తమకు కేటాయిస్తే అధికారిక కార్యకలాపాల కోసం వినియోగించుకుంటామంటూ చంద్రబాబు ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్కు లేఖ రాశారు. చంద్రబాబు లేఖ రాసిన వెంటనే వైసీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం కూడా తమ పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించుకునేందుకు ప్రజావేదికను తమకే కేటాయించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యాన్ని కోరారు. దీనిని తమకు కేటాయిస్తే పార్టీ-ప్రభుత్వం మధ్య సమన్వయం కోసం అనువుగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ నిర్వహించే సమావేశాలకు జగన్ పార్టీ అధ్యక్షుడి హోదాలో హాజరవుతారని, ఆయన భద్రతకు, ట్రాఫిక్కు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని ఆయన వివరించారు. కాబట్టి ప్రజావేదికను తమకే కేటాయించాలని సీఎస్ ను కోరారు. తాను సీఎంగా ఉన్నప్పుడు ఉండవల్లిలోని నివాసంలో ఉన్న చంద్రబాబు అందులోనే కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు సీఎం జగన్కు రాసిన లేఖలో పేర్కొన్నారు. తన ఇంటి పక్కనే ఉన్న ప్రజా వేదికను ప్రతిపక్ష నేత హోదాలో అధికారిక కార్యకలాపాల కోసం వినియోగించుకోవాలని భావిస్తున్నానని, దాన్ని తనకు కేటాయించాలని బాబు కోరారు. ప్రజావేదికను తమకంటే తమకు కేటాయించాలంటూ ఓ వైపు అధికార పార్టీ, మరోవైపు ప్రతిపక్ష నేత విన్నపం నేపధ్యంలో ఏం జరుగుతుందో కొద్ది రోజుల్లో తెలుస్తుంది.