వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇల్లు అంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టం.. అభిరుచి ఆయన నిర్మించుకున్న ఇళ్లలోనే కనిపిస్తూంటుంది. మొదటగా.. ఇడుపులపాయ ఎస్టేట్‌లో మంచి ఇల్లు ఉంది. ఆ తర్వాత పులివెందులలో ఇల్లు ఉంది. కడపలో ఇల్లు ఉంది. బెంగళూరు శివార్లలో యలహంకలో ప్యాలెస్ ఉంది. హైదరాబాద్ లోటస్ పాండ్, తాడేపల్లిలో మరో ప్యాలెస్ ఉంది. ఇప్పుడు.. వైజాగ్‌లో కూడా.. సముద్ర తీరంలో మరో అందమైన ఇల్లు లాంటి ప్యాలెస్ కోసం ప్రణాళికలు వేసుకోక తప్పడం లేదు. ఇంత వరకూ బాగానే ఉంది కానీ.. ఇన్ని ఇళ్లు ఎందుకు అనే సందేహం.. చాలా మందికి వస్తుంది.
కానీ ఇందులో జగన్ తప్పేం లేదు.. ఆయన ఇష్టపడి ఇళ్లు నిర్మించుకుంటున్నారు కానీ.. అందులో ఉండే అవకాశం మాత్రం రావడం లేదు. దేవుడి స్క్రిప్ట్ అలా ఉంటోంది మరి. వైఎస్ సీఎం కాక ముందు.. జగన్ కుటుంబానికి.. హైదరాబాద్‌లోని సాగర్ సొసైటీలో ఓ చిన్న ఇల్లు ఉండేది. వైఎస్ సీఎం అవగానే.. పులివెందులలో ఒకటి.. కడపలో మరొ ప్యాలెస్ కట్టారు. అయితే అక్కడ శాశ్వతంగా ఉండే అవకాశం లేదు. వాటిని ఆస్తులుగానే చూసుకోవాలి. జగన్ సీఎం కాగానే.. అక్కడో పర్సనల్ సెక్రటరీని ప్రభుత్వ ఖర్చుతో నియమించారు.
వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు జగన్ బెంగళూరు కేంద్రంగా వ్యాపారాలు చేసేవారు. జగన్ వ్యాపార సంస్థలన్నింటికీ నిధుల వరద పారించిన సండూర్ పవర్ కర్ణాటకలోనే ఉంది. అప్పుడు.. బెంగళూరు శివార్లలోని యలహంకలో ఎన్ని ఎకరాలో తెలియదు కానీ.. చాలా పెద్దదే కట్టారు. ఆ ఇల్లు నేషనల్ హెడ్‌లైన్స్‌లో నిలిచింది. ఆ ఇంట్లో.. ఓ నెల రోజులు కూడా ఉన్నారో లేదో కానీ.. వైఎస్ మరణంతో.. హైదరాబాద్ మారాల్సి వచ్చింది. ఆ తర్వాత లోటస్‌పాండ్ చరిత్ర..సీబీఐ రికార్డులకు ఎక్కింది.
వైఎస్ మరణం తర్వాత హైదరాబాద్ కేంద్రంగానే రాజకీయాలు చేయాల్సి ఉంటుందని నిర్ణయించుకుని.. తనకు ఉన్న కొన్ని కార్యకలాపాలు లేని కంపెనీల పేరు మీద లోటస్ పాండ్ ను కొనేసి.. నిర్మించేశారు. లగ్జరీలకే లగ్జరీ అని దాని గురించి ప్రచారం జరిగింది. కానీ.. రాష్ట్ర విభజన తర్వాత ఆయన అందులోనూ గడిపిన రోజులు తక్కువే. పాదయాత్ర పేరుతో.. ఎక్కువ సమయం టెంట్లలోనే గడపాల్సి వచ్చింది. అమరావతి ఇంటిని కూడా.. రెండు ఎకరాల్లో భారీగా నిర్మించుకున్నారు. కానీ అందులోనూ ఉండలేకపోతున్నారు.