ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వరుస పెట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయిన జగన్మోహన్ రెడ్డి.. కొద్ది నెలలుగా ఇరువురి మధ్య ఎలాంటి భేటీలు లేని సంగతి తెలిసిందే. ఇరువురు అగ్రనేతల మధ్య చెడిందని.. అందుకే వారి మధ్య భేటీలు ఆగిపోయినట్లుగా కొన్ని వార్తలు తెర మీదకు వచ్చాయి. అయితే.. ఇందులో వాస్తవం మాట ఏమిటన్న దానికి నిదర్శనంగా సంక్రాంతి పండుగ వేళ.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కావాలని నిర్ణయించారు.
జనవరి 13న హైదరాబాద్ లో జరిగే ఈ భేటీ హైదరాబాద్ లో జరగనుంది. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న పలు కీలకమైన అంశాల మీద ముఖ్యమంత్రులు చర్చలు జరుపుతారని చెబుతున్నారు. గోదావరి జలాల్ని కృష్ణా బేసిన్ కు తరలించే అంశంపై రెండు తెలుగు రాష్ట్రాలు ఏ రకంగా ముందుకు సాగాలన్న అంశం పైనా ఇరువురు సీఎంలు కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం.
తొలుత ఈ ప్రతిపాదన తెర మీదకు వచ్చినప్పుడు కొంత విస్మయం వ్యక్తమైనా.. తర్వాత మాత్రం రెండు రాష్ట్రాలు వేర్వేరుగా ముందుకు సాగుతాయన్న ప్రచారం సాగింది. అయితే.. అలాంటిదేమీ లేదని.. కలిసి వెళ్లే అవకాశం ఉంటుందని కేటీఆర్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈ అంశం సజీవంగా ఉందన్న మాట వినిపిస్తోంది.
తాజా భేటీలో ఈ అంశం మీద చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ఇక.. రెండు రాష్ట్రాల్లో నెలకొన్న మరిన్ని అంశాలు కూడా చర్చకు వచ్చే వీలున్నట్లు చెబుతున్నారు. ఏమైనా.. పండుగ వేళ ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ రాజకీయంగా ఆసక్తికరంగా మారుతుందని చెప్పక తప్పదు.