జగన్ గృహ ప్రవేశం…ఈసారి కేసీఆర్ వస్తారా ?

Jagan House Warming Ceremony

అమరావతిలో జరిగే గృహప్రవేశానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఇంతకు ముందే జగన్ ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 14గా అప్పట్లో పేర్కొవడంతో కేసీఆర్ హాజరవుతారని ప్రచారం జరిగింది. అయితే ఈ కార్యక్రమం అనివార్య కారణాలతో వాయిదా పడిన విషయం తెలిసిందే. గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మించిన కొత్త ఇంట్లోకి ఫిబ్రవరి 27న వైఎస్ జగన్ గృహ ప్రవేశం చేయనున్నారని సమాచారం. ఫిబ్రవరి 27 బుధవారం ఉదయం 10 గంటలకు కొత్త ఇంటితోపాటు అదే ముహూర్తానికి వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని కూడా జగన్ ప్రారంభించనున్నారు. జగన్ సోదరి షర్మిల అనారోగ్యానికి గురికావడంతోనే ఫిబ్రవరి 14న జరగాల్సిన నూతన గృహ ప్రవేశ కార్యక్రమం వాయిదా వేస్తున్నట్టు వైసీపీ ప్రకటించింది. అయితే తాజాగా వైఎస్‌ జగన్‌ నూతన గృహప్రవేశానికి ముహూర్తం ఖారారైంది.

ఈ కార్యక్రమానికి పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్లు, పార్లమెంటు జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలతోపాటు పార్టీ నేతలు అందరూ పాల్గొనాలని ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. నిజానికి లండన్ పర్యటనలో ఉన్న జగన్ ఫిబ్రవరి 26న తిరిగొస్తున్నారు. ఆ మర్నాడే జగన్ నూతన గృహ ప్రవేశం, నూతన కార్యాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు చేశారు. ఇకపై తాడేపల్లి నుంచే వైసీపీ కార్యక్రమాలను జగన్ నిర్వహిస్తారు. గృహప్రవేశం అనంతరం ఫిబ్రవరి 28న తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ సమర శంఖారావం సభలో జగన్ పాల్గొంటారు. అయితే ఈసారి ప్రవేశానికి కేసీఆర్ వస్తారా ? లేదా ? అనేది ఇంకా తెలియ రాలేదు.