ఒంగోలు రేప్ బాదితురాలికి జగన్ సర్కార్ అండ

jagan sarkar support for the family of ongole rape victim

ఒంగోలులో మైనర్  బాలికను ఐదు రోజులపాటు నిర్బంధించి, ఆరుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. కామాంధుల చేతిలో అత్యాచారానికి గురైన బాధిత బాలికను హోం మంత్రి సుచరిత, మంత్రులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, తానేటి వనిత పరామర్శించారు. బాధితురాలికి రూ. 10 లక్షల పరిహారం అందజేస్తామని, భద్రత కల్పిస్తామని మంత్రులు భరోసా ఇచ్చారు. అమ్మానాన్న కంటే మన శ్రేయస్సు కోరుకునే వారెవరూ ఉండరని పిల్లలు తెలుసుకోవాలని ఆమె హితవు పలికారు. గుంటూరుకు చెందిన సదరు బాలిక విజయవాడలో హాస్టల్లో ఉండి చదువుకుంటూ స్నేహితుడిని కలిసేందుకని ఒంగోలు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని హోం మంత్రి చెప్పారు. అమరావతిలో మంగళవారం జరిగిన కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో సీఎం వైఎస్‌ జగన్ ఒంగోలు రేప్ బాధిత బాలిక గురించి ఆరా తీశారు. ఆమెకు పరిహారం అందించాలని హోంమంత్రి సుచరితకు సూచించారు. సీఎం ఆదేశాలతో వెంటనే రంగంలోకి దిగిన ఆమె బాలికను పరామర్శించారు. ఒంగోలు బాలికపై అత్యాచారానికి పాల్పడింది వైఎస్ఆర్సీపీ కార్యకర్తేనని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. తప్పు చేసిన ఎవర్నీ క్షమించబోమని, బాధితురాలికి అండగా ఉంటామని సంకేతాలు పంపేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది.