మంగళగిరిలో టీడీపీ నేత దారుణ హత్య…

tdp leader murdered in mangalagiri

ఏపీలో ఎన్నికలు ముగిసినా ఇంకా ఉద్రిక్త వాతావరణం మాత్రం కొనసాగుతుంది. గుంటూరు జిల్లా మంగళగిరిలో టీడీపీ నేత దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది. మంగళగిరిలోని ఇందిరా నగర్ నాలుగో వార్డులో నివాసముంటున్న తాడిబోయిన ఉమా యాదవ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కత్తులతో పొడిచి హత్య చేశారు. మృతుడి ఇంటికి సమీపంలోనే ఈ ఘటన జరిగింది. ముగ్గురు దుండగులు కత్తులతో వచ్చి హత్యచేసి వెళ్లారని స్థానికులు చెబుతున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ఉమా యాదవ్ గతంలో జరిగిన ఓ హత్యకేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఉమ మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలకు అనుచరుడిగా ఉన్నారు. ఎన్నికలకు ముందు ఆమె వైసీపీలోకి వెళ్లినా ఉమా యాదవ్ మాత్రం టీడీపీలో కొనసాగుతున్నారు. ఎన్నికల సమయంలోనూ మంగళగిరిలో కీలక నేతగా వ్యవహరించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లోకేష్ గెలుపు కోసం ప్రయత్నించిన వారిలో ఉమాయాదవ్ కూడా ఒకరు. ఇక ఈ హత్య ఎందుకు చేశారు ? ఏమైనా రాజకీయ కక్షలా ? లేదా వ్యక్తిగత కక్షలా ? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.