వైఎస్ వివేకా హత్య కేసును త్వరితగతిన తేల్చాలంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్.. రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను ఆదేశించారు. దీంతో సీఎం ఆదేశంతో హుటాహుటిన కడపకు చేరుకున్న డీజీపీ… వివేకా హత్యకేసులో నిందితులను తేల్చే పనిలో బిజీబిజీ అయ్యారు. కడపలోని జిల్లా పోలీసు కార్యాలయంలో సిట్ బృందంతో సమావేశమై.. వివేకా హత్య కేసులో ఇప్పటి వరకూ లభించిన ఆధారాలపై ఆరా తీశారు డీజీపీ. ఇదే కేసులో గతంలో ఎవరెవరిపై కేసులు నమోదు చేశారు..? కేసు విచారణలో ఎవరెవరిని విచారించారన్నదానిపై వివరాలు అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది.
శ్రీనివాసులరెడ్డి అనే అనుమానితుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై కూడా డీజీపీ సిట్ బృందాన్ని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. శ్రీనివాసులురెడ్డి ఆత్మహత్య వెనుక గల అసలు కారణం వేధింపులేనా..? లేక..? మరో కారణమేదైనా ఉందా అన్న కోణంలోనూ డీజీపీ ఆరా తీసినట్లు తెలిసింది. రాష్ర్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందంలో 60 మంది అధికారులు పని చేస్తున్నారు. వీరంతా బృందంగా ఏర్పడి రాత్రింబవళ్లు పనిచేస్తున్నా… కీలక ఆధారాలు రాబట్టలేకపోయారు. అనుమానితులను విచారిస్తున్నా అసలు నిందితులు ఎవరో కనిపెట్టలేకపోతున్నారు.
మరోవైపు సింహాద్రిపురం మండలం కసునూరు గ్రామానికి చెందిన కనగంటి శ్రీనివాసులు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. విచారణ పేరుతో పోలీసులు తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ శ్రీనివాసులురెడ్డి సూసైడ్ నోట్ రాసిపెట్టి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. వివేకా హత్య కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తనను కావాలనే పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారంటూ శ్రీనివాసులురెడ్డి చనిపోవడానికి ముందు సీఎం జగన్‌కు, వైఎస్ భాస్కర్ రెడ్డిలకు లేఖ రాశాడు.