చంద్రబాబు అరెస్ట్ వల్ల జగన్ కే నష్టం : మేకపాటి

Jagan's loss due to Chandrababu's arrest: Mekapati
Jagan's loss due to Chandrababu's arrest: Mekapati

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబుకు మద్దతుగా నిరనసలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్‌ను టార్గెట్‌ చేస్తూ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే.. తాజాగా వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు గుప్పించారు. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును అడ్డం పెట్టుకుని, స్వార్థం కోసం జగన్ సీఎం అయ్యారని మండిపడ్డారు.

జగన్ కు ఓటమి భయం పట్టుకుందని, ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారని మేకపాటి చంద్రశేఖర్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు అరెస్ట్ వల్ల జగన్ కే నష్టమని… టీడీపీకి లాభమేనని చెప్పారు. ఎన్నికలను న్యాయంగా నిర్వహిస్తే గెలిచేది టీడీపీనే అని, చంద్రబాబే సీఎం అని అన్నారు. చంద్రబాబు అరెస్ట్ తో వైసీపీ రాజకీయంగా నేలమట్టమయిందని మేకపాటి చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. తన అన్ని మేకపాటి రాజమోహన్ రెడ్డి వల్లే తాను వైసీపీ నుంచి సస్పెండ్ అయ్యానని చెప్పారు. నెల్లూరు జిల్లా మర్రిపాడులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు నిన్న ఆయన మాట్లాడుతూ… చంద్రబాబు జైలు నుంచి విడుదలైన తర్వాత తాను టీడీపీలో చేరుతానని చెప్పారు.

ఇదిలా ఉంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు కస్టడీని కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో బుధవారం వాదనలు జరిగాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్దార్థ లూద్రా వాదనలు వినిపించారు. నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ అధినేత అరెస్ట్ జరిగిందన్నారు. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేకపోయినప్పటికీ కస్టడీని కోరుతున్నారన్నారు. చంద్రబాబుకు సీఐడీ కస్టడీ అవసరం లేదన్నారు. ఆయన అవినీతికి పాల్పడినట్లు ఎక్కడా ఆధారాలు లేవన్నారు. నాలుగేళ్లుగా ఎవరిని అరెస్ట్ చేసినా నిధుల దుర్వినియోగం అంటున్నారన్నారు. చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కుట్రతో కూడుకున్నదన్నారు.