తమ రాష్ట్రంలో ఏర్పాటయ్యే కంపెనీల్లో 75శాతం స్థానిక యువతకే ఉద్యోగావకాశాలు ఇవ్వాలంటూ ఏసీ సీఎం వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు పెంచాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
అయితే జగన్ నిర్ణయం రాష్ట్ర యువతను సంతోషపెట్టినా.. కర్ణాటకలో నివసిస్తున్న తెలుగు ప్రజలను కలవరపరుస్తోంది. ఎందుకంటే ఆ రాష్ట్రంలోనూ లోకల్ నినాదం క్రమంగా పుంజుకుంటోంది. కర్ణాటకలోని ఉద్యోగాల్లో కన్నడిగులకే ఇవ్వాలంటూ ప్రముఖ సినీ నటుడు ఉపేంద్ర డిమాండ్ చేస్తు స్థానిక పరిశ్రమల్లో 70శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలంటూ నిరాహార దీక్ష చేపడుతున్నట్లు ఆయన ప్రకటించారు.
దీనిలో భాగంగా ఈ నెల 14,15 తేదీల్లో బెంగళూరులోని గాంధీ విగ్రహం వద్ద నిరాహార దీక్ష చేస్తున్నానని, తనకు యువత అండగా నిలవాలని ఉపేంద్ర కోరారు. దీనికి సంబంధించి ఆయన ఓ వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు.
కర్ణాటకలో ఉద్యోగాలు స్థానికులకే దక్కాలని ఎన్నో ఏళ్లుగా పోరాటం జరుగుతోందని, ఇప్పటికే దీనికి ఇప్పటికైనా పరిష్కారం కనుక్కుందామని ఆయన పిలుపునిచ్చారు. కర్ణాటకలో లోకల్ నినాదం ఊపందుకుంటున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప కూడా దానికి మద్దతు పలికేలా ట్వీట్ చేశారు.
కర్ణాటకలో తాజా పరిణామాలపై తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాయలసీమ యువతకు ఇది శరాఘాతంగా చెప్పొచ్చు. రాయలసీమకు ఆనుకునే ఉండటంతో అక్కడి ప్రజలకు కర్ణాటకతో ఎంతో అనుబంధం ఉంటోంది. ఏ పని కోసమైనా వారు బెంగళూరుకే వెళ్తుంటారు.
చదువు పూర్తయిన యువత అటు విజయవాడకో, హైదరాబాద్‌కో వెళ్లకుండా బెంగళూరు వెళ్లేందుకు ప్రాధాన్యత ఇస్తారు. మెట్రో సిటీ కావడంతో పాటు తమ ప్రాంతానికి చేరువలో ఉండటంతో అంత బెంగళూరును తమ నగరంగానే భావిస్తుంటారు. అయితే ఇప్పుడు కర్ణాటకలో రాజుకుంటున్న లోకల్ నినాదం తమ ఉపాధి అవకాశాలను నాశనం చేస్తుందేమోనని అంతా భయపడుతున్నారు.