టార్గెట్ కోసం జగన్ పాట్లు.. మార్పులు అందుకేనా ..?

Election Updates: Big shock for YCP.. Who is next..?
Election Updates: Big shock for YCP.. Who is next..?

ఆంధ్రప్రదేశ్‌లో గత ఎన్నికల్లో తిరుగులోని విజయాన్ని అందుకుంది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ఏకంగా 151 స్థానాలు కైవసం చేసుకుంది.. అయితే, టార్గెట్ 2024.. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ అధినేత, సీఎం జగన్ వేగంగా పావులు కదుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నా రు. 175 నియోజకవర్గాల్లో.. సర్వేలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రక్షాళన చేపట్టారు. గెలిచే అవకాశం లేని నేతలను పక్కన పెట్టాలనే కీలక నిర్ణయం తీసుకున్నారు. వారి స్థానాల్లో కొత్త అభ్యర్థులను రంగులో దింపుతున్నారు. 11 నియోజకవర్గాల్లో కొత్త వారికి బాధ్యతలు అప్పగించింది. ఇందులో 5 ఎస్సీ రిజర్వర్డ్ నియోజకవర్గాలు ఉన్నాయి. మొదటి ఫేజ్‌లో నలుగురికి స్థానచలనం కల్పించారు. మంత్రి ఆదిమూలపు సురేశ్‌కు కొండేపి, మేకతోటి సుచరితకు తాడికొండ, మేరుగ నాగార్జునకు సంతనూతలపాడు బాధ్యతలు అప్పగించారు. మరో మంత్రి విడుదల రజినికి చిలకలూరిపేట నుంచి గుంటూరు పశ్చిమ బాధ్యతలు అప్పజెప్పింది.

గ్రూపు తగాదాలున్న కొండేపి, అద్దంకి విషయంలో జగన్ కఠినంగా వ్యవహరించారు. కొండెపి ఇన్‌చార్జ్‌గా ఉన్న వరికుటి అశోక్ బాబును…పార్టీలో ఓ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. టికెట్‌ ఇస్తే ఓడిస్తామని సొంత పార్టీ నేతలు హెచ్చరించడంతో…వరికూటి అశోక్‌బాబుకు వేమూరు బాధ్యతలు ఇచ్చింది. అద్దంకి విషయంలో జగన్ ఇదే వ్యూహాన్ని అమలు చేశారు. అద్దంకి ఇంఛార్జ్ గా ఉన్న కృష్ణ చైతన్యను పార్టీలోని ఒక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కృష్ణ చైతన్యను ఇక్కడి నుంచి తప్పించి హనిమిరెడ్డికి బాధ్యతలు ఇచ్చారు. దీంతో ఈ సెగ్మెంట్‌లో కమ్మ సామాజిక వర్గానికి బదులు రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చినట్లు అయ్యింది. తాడికొండ అసెంబ్లీసెగ్మెంట్ నుంచి గత ఎన్నికల్లో ఉండవల్లి శ్రీదేవి వైసీపీ జెండాపై గెలిచారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా హైకమాండ్ ఆదేశాలకు ధిక్కరించి టీడీపీ అభ్యర్థికి ఓటేశారు. దీంతో శ్రీదేవిని సస్పెండ్ చేసిం ది. ఆమె స్థానంలో కత్తెర సురేష్‌కుమార్‌కు నియోజకవర్గ బాధ్యతలు ఇచ్చింది. తాజాగా కత్తెర స్థానంలో తాడికొం డకు మాజీ హోం మం త్రి మేకతోటి సుచరితను రిప్లేస్ చేశారు. మంగళగిరి సెగ్మెంట్ నుంచి గత రెండు ఎన్నికల్లో గెలిచిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి స్థానంలో…గంజి చిరంజీవి తెర మీదకు వచ్చారు. ఈ సెగ్మెంట్‌లో రెడ్డి సామాజిక వర్గానికి బదులు బీసీ సామాజిక వర్గ అభ్యర్థిని మోహరించాలని వైసీపీ నిర్ణయించింది. ఇక్కడ పద్మశాలి సామాజిక వర్గ ఓట్లు ఎక్కువగా ఉండటం , గంజి చిరంజీవి అదే సామాజిక వర్గమే చెందిన వ్యక్తి కావడంతో వైసీపీ ఈ నిర్ణయం తీసుకుంది. గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి వయసు రీత్యా యాక్టివ్‌గా లేకపోవడంతో…ఆయన కుమారుడు దేవన్ రెడ్డికి గతంలోనే నియోజవర్గ బాధ్యతలు ఇచ్చా రు. ఇక్కడ దేవన్ రెడ్డి గెలిచే అవకాశాలు లేకపోవడంతో…వరికూటి రామచంద్రావుకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. రేపల్లె నియోజకవర్గం నుంచి గత రెండు ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిగా పోటీ చేసిన మోపిదేవి ఓటమి పాలయ్యారు. తాజాగా రేపల్లె నియోజకవర్గ బాధ్యతలను ఈవూరు గణేశ్‌కు కట్టబెట్టింది. ఈసారి ఇక్కడ బీసీ స్థానంలో కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు.

మరోవైపు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. వైసీపీ సభ్యత్వానికీ రిజైన్ చేశారు. ఎమ్మెల్యే పదవికి స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా చేసిన ఆర్కే .. సభాపతి కార్యదర్శికి ఆ లేఖను అందజేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆర్కే ..రాజీనామా కారణాల్ని వెల్లడించడానికి నిరాకరించారు. ఈ అనూహ్య పరిణామాలతో వైసీపీ హైకమాండ్ వెంటనే మంగళగిరి నియోజకవర్గ నేతలతో సమావేశమైంది. గుంటూరు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, నియోజకవర్గ నేతలు గంజి చిరంజీవి, మురుగుడు హనుమంత రావు, వేమారెడ్డితో సీఎం జగన్ భేటీ అయ్యారు. మంగళగిరిలో పార్టీ పరిస్థితిపై సమీక్షించిన తర్వాత.. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ను మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఆర్కే స్థానంలో బీసీ సామాజికవర్గానికి చెందిన గంజి చిరంజీవిని బరిలో దించే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం . దీంతో ఆర్కే పార్టీకి రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు, నియోజకవర్గ ఇంచార్జ్ తిప్పల దేవన్ రెడ్డి రాజీనామా చేసిన విషయం విదితమే.