వైసీపీ అధినేత వైఎస్ జగన్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై 90,543ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. 30 రౌండ్లలో కొనసాగిన ఓట్ల లెక్కింపులో తొలి నుంచి ఆధిక్యంలో కొనసాగుతూ వచ్చిన జగన్ విజయ దుందుభి మోగించారు. వైఎస్ జగన్ 2014లో పులివెందుల నుంచి 74,500 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన 90,543 ఆధిక్యంతో గెలుపొందడంతో తన మెజార్టీ రికార్డు మరింత మెరుగుపరుచుకున్నారు.
తాజా ఎన్నికల్లో వైసీపీ విజయదుందుభి మోగిస్తోంది. ఇప్పటికే 40కి పైగా స్థానాలను గెలుచుకున్న వైసీపీ.. మరో 100కి పైగా స్థానాల్లో ఆధిక్యం కొనసాగుతోంది. రాజకీయాల్లో ఐరెన్ లెగ్ గా పేరున్న చిత్తూరు జిల్లా నగరిలో ఆర్కే రోజా మరోసారి గెలుపొందారు. 2వేల 681 ఓట్ల మెజార్టీతో ఆమె విజయాన్ని అందుకున్నారు. అదేవిధంగా శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు విజయం సాధించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి ఘన విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ కనీసం 30 స్థానాలు కూడా గెలుచుకోలేక పూర్తిగా చతికిలపడింది. పార్లమెంటు ఎన్నికల్లోనూ వైసీపీ ప్రభంజనం దిశగా పయనిస్తోంది.