‘నాతో నేను ప్రేమలో పడిపోయా’ అంటున్నారు జగపతిబాబు. ‘సలార్’లో చేస్తున్న పాత్ర గురించే ఇలా అంటున్నారు. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు చేస్తున్న రాజమన్నార్ పాత్ర లుక్‌ని విడుదల చేశారు. ‘‘నా వరస్ట్ లుక్స్ (విలన్ క్యారెక్టర్ లుక్స్‌ని ఉద్దేశించి)లో ఇది బెస్ట్. ప్రశాంత్ నీల్ సహాయంతో నటుడిగా నా బెస్ట్ ఇస్తాను’’ అని సోషల్ మీడియా ద్వారా జగపతిబాబు పేర్కొన్నారు.
‘‘కథ కీలకమైన మలుపు తిరగడానికి రాజమన్నార్ పాత్రే కారణం అవుతుంది. ఇప్పటికే 20 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరిలోపు పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు విజయ్ కిరగందూర్. ‘‘సలార్’ షూటింగ్ చకచకా జరుగుతోంది’’ అన్నారు ప్రశాంత్ నీల్. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రుతీహాసన్ కథానాయికగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదల కానుంది.