ఎంటెక్ విద్యార్థిని ఆత్మహత్య

ఎంటెక్ విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎంటెక్ విద్యార్థిని మౌనిక ఆత్మహత్య కేసు మలుపులు తిరుగుతోంది. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులకి ‘నేను మంచి కూతురిని కాలేకపోయాను.. నన్ను క్షమించండి నాన్న’ అంటూ ఆమె రాసిన సూసైడ్ నోట్ లభ్యమైనట్లు తెలుస్తోంది. అయితే మౌనిక ఆత్మహత్యపై ఆమె తల్లిదండ్రులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. వేధింపుల కారణంగానే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తున్నారు. ఫ్యాకల్టీ వేధింపులతోనే మౌనిక ఆత్మహత్య చేసుకుందని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడం అనుమానాలకు తావిస్తోంది.

విద్యార్థిని ఆత్మహత్య ఘటనపై మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు స్పందించారు. మానసిక ఒత్తిడి, వ్యక్తిగత కారణాలతోనే ఆమె సూసైడ్ చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు చెప్పారు. చనిపోయే ముందు ఆమె రాసిన సూసైడ్ నోట్ లభ్యమైందన్నారు. నేను మంచి కూతురిని కాలేకపోయాను, నన్ను క్షమించండి నాన్న అని లేఖలో రాసి ఉన్నట్లు ఆయన చెప్పారు. తమ కూతురు ఫ్యాకల్టీ వేధింపులతోనే ఆత్మహత్య చేసుకుందని ఆమె తండ్రి ఫిర్యాదు చేశారని.. ఆ కోణంలోనూ విచారణ జరుపుతున్నామన్నారు. ఆమె ఫోన్, ల్యాప్‌టాప్‌ను సీజ్ చేశామని.. అన్ని కోణాల్లో కేసు విచారణ జరుపుతామని డీసీపీ తెలిపారు.