ఖతార్ లో నిర్బంధంలో ఉన్న 8 మంది భారతీయుల కేసుకు సంబంధించి కేంద్రం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని విదేశాంగమంత్రి ఎస్ జై శంకర్ తెలిపారు. బాధితుల కుబుంబ సభ్యులను కలిసిన ఆయన ఖతార్ లో నిర్బంధంలో ఉన్న వారి విడుదలకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలను కొనసాగిస్తోందని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా జైశంకర్ వెల్లడించారు.
గత కొన్ని నెలలుగా ఖతార్ లో నిర్బంధంలో ఉన్న భారత్ కు చెందిన ఎనిమిది మంది నౌకాదళ మాజీ అధికారులకు అక్కడి కోర్టు కొన్నిరోజుల కింద మరణశిక్ష విధించింది. గూఢచర్యం ఆరోపణలపై వీరికి ఈ శిక్ష పడింది. ప్రైవేటు భద్రతా సంస్థ అల్ దహ్రాలో వీరంతా పని చేస్తుండగా, గతేడాది ఆగస్టులో గూఢచర్యానికి పాల్పడుతున్నారన్న అభియోగాల కేసులో అదుపులోకి తీసుకున్నారు. ఎనిమిది మంది భారతీయులకు ఖతార్ కోర్టు మరణశిక్ష విధించడంపై భారత విదేశీ వ్యవహారాల శాఖ ఇప్పటికే విచారం వ్యక్తం చేసింది. అత్యంత ప్రాముఖ్యత గల ఈ కేసుపై న్యాయపోరాటం చేస్తామని వెల్లడించింది.