Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భాషతో సంబంధం లేకుండా ఏ సినిమాలో అయినా హీరో, హీరోయిన్లు సినిమా అంతా ప్రేమించుకుని చివర్లో పెళ్లితో ఒక్కటవుతారు. ప్రేమ, వారి కష్టాలు… అనేక సినిమాల్లో, అనేక రకాలుగా చిత్రించినా చివరికి మాత్రం పెళ్లికార్డుతో సంతోషంగా ముగిస్తారు. కానీ కొన్ని విషాదభరిత చిత్రాల్లో మాత్రం హీరో, హీరోయిన్లో ఎవరో ఒకరు చనిపోవడమో, వాళ్లిద్దరూ విడిపోవడమో జరుగుతుంది. ప్రపంచ ప్రఖ్యాత హాలీవుడ్ మూవీ టైటానిక్ కూడా ఇలాంటి విషాదాంతమే. 1912లో ప్రమాదవశాత్తూ సమద్రంలో మునిగిపోయిన టైటానిక్ ఓడ నేపథ్యంలో 1997లో తెరకెక్కిన టైటానిక్ కథ కూడా ఆ ఓడలాగే విషాదంగా ముగుస్తుంది.
లియోనార్డో డి కాప్రియో, కేట్ విన్ స్లెట్ జంటగా నటించిన టైటానిక్ కు హీరో చనిపోయే క్లైమాక్స్ ఆయువుపట్టులాంటిది. ప్రేయసి కేట్ ను కాపాడి హీరో లియోనార్డో మరణించిన సన్నివేశం సినిమా చూసిన ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. హీరో మరణించడం అనేది రొటీన్ సినిమా ఫార్ములాకు భిన్నమైన కథ. అందుకే అభిమానులు అంతత్వరగా ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. నిజానికి టైటానిక్ కు కూడా సాధారణ సినిమా ముగింపు ఇవ్వొచ్చు. హీరోయిన్ తో పాటు హీరో కూడా ప్రమాదం నుంచి బయటపడి, వారిద్దరూ పెళ్లిచేసుకుని, సుఖంగా జీవించినట్టు టైటానిక్ కు ముగింపు ఇస్తే బాగుండేదని ఎంతో మంది భావించారు.
అయితే అలాంటి క్లైమాక్స్ ఉంటే టైటానిక్ కు అర్ధం లేకుండా పోయేదని సినిమా డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ అభిప్రాయపడ్డారు. టైటానిక్ చావు, విడిపోవడం అనే అంశాలతో ముడిపడి ఉందని, కాబట్టి అతను చనిపోవాలని కామెరూన్ అన్నారు. ఇది ఓ కళాత్మక నిర్ణయమని, ఈ కథలో చివరి వరకు ఆమె పాత్రను ఉంచగలిగామని, అతణ్ని ఉంచడం కుదరలేదని ఆయన చెప్పారు. 20 ఏళ్ల తరువాత దీని గురించి మాట్లాడుకోవడం సరదాగా ఉందన్నారు. హీరో పాత్రను చక్కగా తెరకెక్కించామని, ఆ పాత్ర ఎంత బాగుందంటే క్లైమాక్స్ లో అతను చనిపోయినప్పుడు ప్రేక్షకులు చాలా ఫీలయ్యారని, ఇదంతా కళలో ఒక భాగమని వివరించారు.