కాంగ్రెస్ తమ ఓటమికి పోస్టు మార్టం చేసుకుంటోంది. ఈ సందర్బంగా జానారెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అందులో ఒకటి అందరినీ ఆకట్టుకుటోంది. సోమవారం సాయంత్రం ఎన్నికల ఫలితాలపై మిర్యాలగూడలో కాంగ్రెస్ సమీక్ష సమావేశం ఏర్పాటుచేసింది. నల్గొండ జిల్లాకు చెందిన జానారెడ్డి దీనికి హాజరయ్యారు. మిర్యాల గూడ నుంచి పోటీ చేసిన ఆర్.కృష్ణయ్య కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా జానారెడ్డి ఒకరిపై మరొకరు నిందారోపణలు చేసుకోకుండా సమష్టిగా గెలుపుకోసం కృషి చేయాలని, రానున్న రోజుల్లో పార్టీని విజయ తీరాలకు చేర్చాలని అన్నారు. అయితే, ఎన్నికలకు ముందు వచ్చిన గాసిప్‌లు నిజమేనా అని అనుమానం వస్తోంది. ముఖ్యమంత్రి రేసులో ఉన్న ఐదుగురు కాంగ్రెస్ పెద్దలు తమ గెలుపు కోసం కంటే తమ కాంపిటీటర్ల ఓటమికి ఎక్కువ కష్టపడ్డారని అప్పట్లో పుకార్లు వినిపించాయి. ఇపుడు జానా నోటి నుంచే వచ్చిన మాటలను బట్టి అది నిజమనుకోవాలి. వారు గెలిస్తే తాము సీఎం కాలేమని ఆ ఐదుగురు తమకు కాంపిటీటర్‌గా ఫీలవుతున్న వారిని ఓడించడానికి శాయశ్శక్తులా కష్టపడ్డారని వినపడింది. బహుశా నిజమేమో అని ఇపుడు అనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఇదే మీటింగ్‌లో కేసీఆర్‌పై కూడా జానారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లి గెలిచిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి ఆరోపించారు. కేసీఆర్ నోట్ల కట్టలే తమ ఓటమికి కారణమన్నారు. డబ్బులు, మద్యం పంపిణీ చేసి టీఆర్ఎస్ విజయం సాధించిందన్నారు. సమష్టిగా కృషి చేసి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఎన్నికలకు కొన్ని రోజుల ముందే కూటమి అభ్యర్థులను ఫైనల్ చేయడం వల్ల ప్రజలను కలవలేకపోయామన్నారు. మిర్యాలగూడలో తనకు 53 వేల ఓట్లు వచ్చాయని పేర్కొన్న కృష్ణయ్య.. తనకు ఓట్లేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.