జనసేన పార్టీ కార్యాలయంలో నర్సాపురం లోక్సభ నియోజకవర్గ జనసైనికులతో సమావేశమైన పవన్.. పార్టీ బలోపేతంపై చర్చించారు. అనంతరం మాట్లాడిన పవన్ ఆసక్తికర విషయాలు చెప్పారు. తన సొంత లాభం కోసం పార్టీ పెట్టాల్సిన అవసరం లేదు. ఆఫీసులు కట్టాల్సిన పనిలేదు.
ఎవరెవరితోనో మాటలు పడక్కర్లేదన్నారు. రాజకీయ పార్టీ నడపడం అంత సులువైన విషయం కాదని.. ఎన్ని సవాళ్లు ఎదురైనా ఇంకా నిలబడింది రాజకీయ వ్యవస్థ మార్చాలనే సంకల్పంతోనే అన్నారు. దొంగ చాటుగా పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు జనసేనాని. కోట్లాది మందితో చప్పట్లు కొట్టించుకునే స్థాయిలో ఉన్నా.. అన్నీ వదులుకుని ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చానన్నారు.
టీడీపీతో పొత్తు పెట్టుకోవాలనుకుంటే.. నేరుగా పొత్తు పెట్టుకునే ధైర్యం ఉందన్నారు. ఇటీవల ఎన్నికల్లో రెండు పార్టీలు తనతో పొత్తు కోసం సంప్రదించాయని.. ఒంటరిగా పోటీ చేయాలని ఉద్దేశంతో ఒప్పుకోలేదన్నారు. తనకు పొత్తు పెట్టుకునే అవసరం లేదన్నారు. ఎంత కష్టమైనా ఒంటరిగా బరిలోకి దిగామన్నారు.
వైసీపీ ప్రభుత్వానికి వంద రోజుల సమయం ఇస్తున్నామన్నారు పవన్. వంద రోజుల తర్వాత ప్రభుత్వ పాలనపై స్పందిస్తామన్నారు. వైసీపీ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పాలన ఎలా సాగుతుందో అర్థం చేసుకోవడానికి కొంత సమయం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. పాలన సరిగా లేకపోతే నిలదీస్తాం, ప్రశ్నిస్తాం, పోరాడతామన్నారు.
రాష్ట్రంలో ఎక్కడైనా జనసైనికులపై దాడులు జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు జనసేనాని. అవసరమైతే తానే స్వయంగా రోడ్డుపైకి వచ్చి కూర్చుంటానన్నారు. జనసైనికులు ధైర్యంగా ఉండాలని.. ఎవరూ భయపడాల్సిన పని లేదన్నారు.