వైసీపీకి ఓపిక లేదు…జనసేనకి క్లారిటీ లేదు…!

Janasena-And-Ysrcp-Not-To-C

తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీలో నిలుస్తుందని, తప్పకుండా తమ ఉనికి చాటుతుందని భావించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు నిరాశ తప్పేలా లేదు. నామినేషన్లు ముగింపు దగ్గర పడుతున్నా ఆ పార్టీ నుంచి ఒక్క అభ్యర్థి పేరును ప్రకటించలేదు. మరోవైపు వైసీపీ కూడా తమ తమ అభ్యర్థులెవరినీ పోటీలో నిలపలేదు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గతంలో ప్రకటించారు. అయితే, సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందుస్తు ఎన్నికలకు సిద్ధం కావడం జనసేనను ఇబ్బందుల్లో నెట్టింది. ఏపీతో పోల్చితే తెలంగాణలో క్షేత్రస్థాయి కేడర్‌ పూర్తిగా బలోపేతం కాలేదు. ఒక వేళ పోటీ చేయాలనుకున్నా తగిన సమయం లేదు. ఎలాంటి కసరత్తులు చేకుండా బరిలోకి దిగితే పార్టీకి నష్టమనే అభిప్రాయం వ్యక్తమవడంతో ఆ ఆలోచిన చేయడం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్న జనసేన ఇప్పటికిప్పుడు తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడం రెండు పడవలపై ప్రయాణంలా ఉంటుందనే ఉద్దేశంతో వెనక్కి తగ్గినట్లు సమాచారం.

Pawan Kalyan

ముందస్తు ఎన్నికలు కాకుండా షెడ్యూల్ ప్రకారం ఎన్నికలను ప్రకటించి ఉంటే జనసేనకు తెలంగాణపై దృష్టి పెట్టేందుకు అవకాశం దక్కేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2019లో ఎన్నికలు జరిగినట్లయితే 23 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయాలని పవన్ భావించారు. తెలంగాణలో టీఆర్ఎస్‌‌తో కూడా ఆయనకు మంచి సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్‌కు పవన్ మద్దతు తెలుపుతారా, లేదా మౌనంగా ఉంటారా అనేది చూడాలి. అయితే, కొంతమంది స్వతంత్ర అభ్యర్థులు తమకు మద్దతు తెలపాలని జనసేనను కోరుతున్నట్లు తెలిసింది. అలాగే తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానుల మధ్య విభేదాలు తలెత్తాయి. హుజూర్ నగర్ లో ఇటీవల సమావేశం ఏర్పాటు చేసిన కొందరు పవన్ అభిమానులు టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. దీనిపై మిగతా సభ్యులు మండిపడ్డారు. హైదరాబాద్ లోని పవన్ కల్యాణ్ అభిమాన సంఘానికి తెలియకుండా, జిల్లాలోని తమకు చెప్పకుండా నిర్ణయం తీసుకోవడం ఏంటని మిగతా అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

jagan-speech

ఈ నేపథ్యంలో పలువురు అభిమానులు సైదిరెడ్డికి మద్దతు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ నియోజకవర్గంలో నిరసనకు దిగారు. ఈ విషయమై హైదరాబాద్ లోని అభిమాన సంఘానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. దీంతో పవన్ అభిమానులు రెండు గ్రూపులుగా చీలిపోయినట్లయింది. కాగా, ఈ వ్యవహారంపై పవన్ కల్యాణ్ అభిమాన సంఘం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే వైసీపీ విషయానికి వస్తే తెలంగాణలోని కొన్ని స్థానాల్లో ఆ పార్టీకి పట్టు ఉన్నా దానిని వాడడానికి ఆ పార్టీ ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో తెలంగాణ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీతో జగన్ మంచి సంబంధాలు ఉన్న నేపథ్యంలో వైసీపీ శ్రేణులు టీఆర్ఎస్‌‌కు మద్దతు తెలిపే అవకాశాలున్నాయి.

ANDHRAPRADESH-TELENGANA

తమ అధినేత నుంచి ఎలాంటి పిలుపు రాకపోవడంతో స్థానిక వైసీపీ నేతల్లో గందరగోళం నెలకొంది. 2019లో ఏపీలో వచ్చే ఫలితాలు బట్టి 2024లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2014 ఎన్నికల్లో వైసీపీ మొత్తం 79 అసెంబ్లీ, 3 లోక్ సభ స్థానాలకు పోటీ చేసింది. ఇందులో 3 అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానాలను మాత్రమే విజయం సాధించింది. అయితే వైసీపీ నుంచి గెలిచిన ఆ ముగ్గురు అభ్యర్థులు ఇప్పుడు టీఆర్ఎస్‌లో చేరారు. అది జగన్ ఒప్పుకోవడంతోనే అని చెబుతూ ఉంటారు. అందుకే బలంగా ఉన్న స్థానాల్లో తిరిగి పోటీ చేయాలన్నా సరైన అభ్యర్థులు లేకపోవడంతో వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, వైసీపీ కనీసం కొన్ని స్థానాల్లోనైనా అభ్యర్థులను బరిలోకి దింపి ఉండాల్సిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.