Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విప్లవవీరులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల స్ఫూర్తితో ఏపీ ప్రయోజనాల కోసం పోరాటం చేద్దామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదలచేశారు. 1931లో ఇదే రోజు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ దేశం కోసం బలిదానాలు చేశారని, బానిస సంకెళ్ల నుంచి భారతమాతని విడిపించేందుకు తమ జీవితాలు అర్పించారని, వారి త్యాగాలు లక్షల మంది మనసుల్ని జ్వలింపచేశాయని జనసేనాని విశ్లేషించారు.
ఈరోజుకీ ఎక్కడైనా అన్యాయంపై ఎదురుతిరగడంలో ఆ త్యాగధనుల జీవితాలు ఇచ్చిన స్ఫూర్తే ఉంటుందని, జనసేన కూడా వారి స్ఫూర్తితోనే ముందుకు సాగుతుందని పవన్ వెల్లడించారు. ఆర్థికంగా మెరుగైన పరిస్థితులు తీసుకురావడంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు విఫలమయ్యాయని, ఈ వైఫల్యాలపై విప్లవమూర్తులను స్ఫూర్తిగా తీసుకుని పోరాటంచేస్తామని తెలిపారు.భవిష్యత్ తరాల కోసం, జనం కష్టాల పట్ల స్పృహతో, వారి సంక్షేమం కోసం స్వతంత్రమైన ఆలోచనలతో స్పష్టమైన ప్రణాళిక కలిగి ఉన్న భగత్ సింగ్ నిజమైన మేధావని జవహర్ లాల్ నెహ్రూ కొనియాడారని, నిస్వార్థంగా, సాహసోపేతమైన త్యాగాలు చేసిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లను స్మరించుకుంటూ జనసేన సెల్యూట్ చేస్తోందని పవన్ కళ్యాణ్ తన ప్రకటనలో పేర్కొన్నారు.