Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వైసీపీ అధినేత జగన్ పై జనసేన నేతలు మండిపడ్డారు. జనసేన అధినేతపై జగన్ చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమైనవన్నారు. పవన్ ప్రజలతోనే ఉన్నారని, ప్రతిపక్ష నేత అయిన జగన్ మాత్రం అసెంబ్లీని, ప్రజల సమస్యలను వదిలేశారని విమర్శించారు. పవన్ ప్రజల సమస్యలపై స్పందిస్తున్నారని, అవిశ్వాసం విషయంలో టీడీపీ, వైసీపీకి దిక్సూచిగా నిలిచింది పవన్ కళ్యాణే అన్న సంగతి మర్చిపోవద్దని జనసేన ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి, పార్టీ ప్రతినిధులు అద్దేపల్లి శ్రీధర్, పార్థసారధి వ్యాఖ్యానించారు. ఢిల్లీలో రాష్ట్రం కోసం నిరసనలు, ఆమరణ దీక్షలు చేస్తున్న ఎంపీలకు సంఘీభావం తెలిపారు.
బీజేపీని నిలదీయడంలో రాష్ట్ర అధికార, ప్రతిపక్షాలు విఫలమవుతున్నాయని, ఆ రెండు పార్టీలు కేసుల భయంతో బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీసి అడగడం లేదని ప్రజల్లో చర్చ నడుస్తోందన్నారు. ఏపీ ప్రజలకు న్యాయంచేయాలంటే లోక్ సభ, రాజ్య సభలతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా రాజీనామాలు చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని సూచించారు. బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలు విషయంలో వెనుకడుగు వేస్తోందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలో చెప్పిన అంశాలు అమలుచేసేలా జనసేన ప్రజాక్షేత్రంలోనే పోరాటం చేస్తోందని, ఈ కార్యాచరణతో అధికార, ప్రతిపక్షాలకు నిద్రలేకుండా చేస్తామని హెచ్చరించారు.