Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఏ రాజకీయ పార్టీ సుదీర్ఘ కాలం నిలవాలంటే మూల సిద్ధాంతం బలంగా ఉండాలి. ఈ విషయం అందరికీ తెలుసు. అయినా సైద్ధాంతిక బలం ఉందని చెప్పుకుంటున్న వామపక్షాలు కూడా దెబ్బ తింటున్నాయి. దీనికి కారణం తాము అనుకుంటున్న సిద్ధాంతం సమకాలీన సమాజానికి అవసరమా , కాదా అనేది కూడా చూసుకోకుండా ముందుకు నడవడం. కాలంతో పాటు వచ్చే మార్పులను ఆకళింపు చేసుకోకుండా పాత సిద్ధాంతాలకు కట్టుబడి ఉండటం. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకునే జనసేన అధినేత తమ పార్టీ మూల సిద్ధాంతాలు బయటపెట్టారు.
1 . కులాలని కలిపే ఆలోచనా విధానం.
2 . మతాల ప్రసక్తి లేని రాజకీయం
3 . భాషలను గౌరవించే సంప్రదాయం
4 . సంస్కృతులను కాపాడే సమాజం
5 . ప్రాంతీయతను విస్మరించని జాతీయ వాదం.
సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చిన జనసేన మూల సిద్ధాంతాలు చూసినప్పుడు అబ్బా ఎంత గంభీరమైన గమ్యం ఎంచుకుంది జనసేన అనిపించింది. సమాజాన్ని కాచివడపోసిన ఓ రాజనీతిజ్ఞుడు రూపొందించిన తాత్విక సిద్ధాంతం తరహాలో కనిపిస్తున్నాయి పవన్ సిద్ధాంతాలు. అయితే వీటి రూపకల్పనకు పవన్ ఎన్నాళ్ళు కష్టపడ్డారో తెలియదు. పార్టీ పెట్టిన నాలుగేళ్లకు వీటిని బయటపెట్టారు. అయితే సిద్ధాంతాలు, గమ్యాలు అనుకున్నంత తేలిక కాదు వాటిని చేరుకోవడం. ప్రజారాజ్యం స్థాపన సమయంలో కూడా సరికొత్త రాజకీయం అన్న మాట వినిపించింది. పార్టీ ప్రెస్ మీట్ వెనుక పోస్టర్స్ లో పూలె లాంటి మహానుభావులు కనపడడం ఆశ్చర్యం అనిపించింది. కానీ గమ్యానికి తగినట్టు ప్రయాణం లేదని కొద్దికాలంలోనే అర్ధం అయ్యింది.
ప్రజారాజ్యం అనుభవాన్ని దృష్టిలో ఉంచుకునే పార్టీ మూల సిద్ధాంతాలని తయారు చేసుకోడానికి పవన్ ఇంత సమయం తీసుకుని ఉండొచ్చు. కానీ గమ్యానికి తగినట్టు ఏ మార్గం లో వెళతారో కూడా చెప్పి ఉంటే బాగుండేది. కులాలని కలపడం అనే సిద్ధాంతానికి తగినట్టే ప్రస్తుతం పవన్ ఎప్పటి నుంచో కాపు,కమ్మ కులాల మధ్య వున్న ద్వేష భావాన్ని తగ్గించడానికి ఓ ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తోంది. కానీ అవే ప్రయత్నాలు రెడ్లలో అసంతృప్తి రగిలిస్తున్నాయి. ఇలా పైపై పూతలు,మందులు వల్ల సమస్య మూలం తొలిగే అవకాశం ఉండదు. సమస్యకి మూలాల నుంచే దారి వెదకాలి. కులాన్ని కాదనుకునే సమాజం సాధ్యపడుతుందేమో గానీ కులాల మధ్య సామరస్య వాతావరణం కష్టమే. ఇక విశ్వాసాల కి పుట్టినిల్లు లాంటి భారత దేశంలో మత ప్రమేయం లేని రాజకీయం సాధ్యమా ? ప్లేటో తరహాలో ఆదర్శ రాజ్యం సృష్టించాలన్న ఆలోచన బాగుంది. గమ్యం గంభీరంగా వుంది. కానీ వెళ్లే దారి గుండా ముళ్ల కంచెలున్నాయి. వాటిని ఎలా తొలగించాలి అన్న దానిపై విస్తృత కసరత్తు అవసరం లేదంటే ఆదర్శం ఆదర్శంగానే మిగిలిపోతుంది. ఇక సినిమా పరిభాషలో చెప్పాలంటే కధ తో పాటు కధనం కూడా బాగుండాలి.