మంత్రి లోకేష్‌పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రత్యక్ష ఎన్నికల్లో మంత్రి లోకేష్ గెలుస్తాడని చంద్రబాబుకు నమ్మకం లేదని, అందుకే దొడ్డిదారిన ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేశారని ఎద్దేవా చేశారు. లోకేష్‌కు దమ్ముంటే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. లోకేష్‌కు ప్రత్యర్థిగా జనసేన తరఫున ఒక కార్యకర్తను నిలబెడతామని, ఎవరు గెలుస్తారో చూద్దామని పవన్ సవాల్ చేసారు. సినీ నటుడికి ఏమి తెలుసని కొందరు నన్ను విమర్శిస్తున్నారని.. ఏ అంశంపై మాట్లాడటానికైనా తాను సిద్ధంగా ఉన్నానని పవన్ తెలిపారు. చంద్రబాబు, లోకేశ్, జగన్ తనతో చర్చించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు వయసు మీద పడినా డబ్బు, అధికారంపై ఆశ తగ్గలేదని ఎద్దేవా చేశారు. దొడ్డిదారిన లోకేష్‌ను మంత్రిగా చేశారని విమర్శించారు.
ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా లోకేష్‌ను మన నెత్తిన రుద్దుతున్నారని మండిపడ్డారు. అలా చంద్రబాబు తన కొడుకును ముఖ్యమంత్రిగా చేయాలని చూస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. లోకేష్ సూత్రం ప్రకారం.. డాక్టర్ కొడుకు డాక్టర్ కావాలని, రైతు కొడుకు రైతు కావాలని, ఇంజినీరింగ్ కొడుకు ఇంజినీరింగ్ కావాలని, సీఎం కొడుకు సీఎం కావాలన్నారు. లోకేష్ సీఎం అయి మన నెత్తిమీద ఎక్కి తొక్కాలా అని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని తెలుగుదేశం ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని పవన్ విమర్శించారు. మనము చెబితే కానీ వాళ్లకు ఉద్దానం సమస్య గుర్తు రాదని, మనం వెళితే కానీ వాళ్లు తుమ్మపాల చక్కెర ఫ్యాక్టరీపై సమీక్ష చేయరని విమర్శించారు. డబ్బు, పేరు సంతృప్తి ఇవ్వలేదని, దశాబ్దాలుగా ప్రేమ పంచిన ప్రజలకు న్యాయం చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలిచినా, గెలవకపోయినా యువత, అణగారిన వర్గాలకు జనసేన అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. 2019లో జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని, రాజకీయాల్లో సమూల మార్పు తీసుకొస్తుందని ధీమా వ్యక్తం చేశారు.