జపాన్‌ను సుదీర్ఘకాలం పరిపాలించిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించిన షింజో అబె అనారోగ్య కారణాలతో పదవి వీడనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా శుక్రవారం మీడియాకి వెల్లడించారు. తాను అనుకున్న లక్ష్యాలను చేరుకోకుండానే పదవి వీడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ప్రజలకు మంచి జరిగే నిర్ణయాలు తీసుకునే స్థితిలో లేనప్పుడు ప్రధానిగా కొనసాగలేను. నా పదవికి రాజీనామా చేస్తున్నా’’అని 65 ఏళ్ల వయసున్న అబె ప్రకటించారు.
యుక్త వయసులో ఉన్నప్పట్నుంచి అల్సరేటివ్ కాలిట్స్ అనే పెద్ద పేగుకి సంబంధించిన సమస్యతో అబె బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగైనా పూర్తి స్థాయిలో కోలుకుంటానన్న నమ్మకం తనకి లేదన్నారు. చికిత్స పూర్తయ్యాక సోమవారం పదవి నుంచి వైదొలుగుతానని షింజో అబె చెప్పారు. వచ్చే ఏడాది సెప్టెంబర్‌తో ఆయన పదవీకాలం ముగిసిపోతుంది. అంతవరకు షింజో అబె పదవిలో కొనసాగాలని పార్టీ ప్రతినిధులు భావించారు కానీ అబె ఆరోగ్య పరిస్థితి దిగజారడంతో ఆయన రాజీనామా చేయాలన్న నిర్ణయానికి వచ్చారు.
2006లో తొలిసారిగా జపాన్‌కు ప్రధాని అయిన అబె అనారోగ్య సమస్యలతో ఏడాదికే రాజీనామా చేశారు. తిరిగి 2012లో అధికారంలోకి వచ్చిన ఆయన తన ఆర్థిక విధానాలతో గుర్తింపు పొందారు. జపాన్ ప్రధానమంత్రి అనారోగ్యంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు.
‘‘స్నేహితుడా నీ అనారోగ్యం అత్యంత బాధాకరం. నీ నాయకత్వం, చిత్తశుద్ధితో భారత్, జపాన్ మధ్య సంబంధాలు బాగా బలపడ్డాయి. అనారోగ్య సమస్యల నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’అని మోదీ ట్వీట్ చేశారు. కాగా, ప్రపంచంలోనే ఆర్థికంగా శక్తిమంతమైన మూడో దేశమైన జపాన్ తదుపరి ప్రధాని ఎవరన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఉప ప్రధాని తారో అసో, రక్షణ మంత్రి షిగెరు ఇషిబా, ఫ్యుమియో కిషిడా పేర్లు వినిపిస్తున్నాయి.