తెలుగులోనే కాదు ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలి స్పేస్ (అంతరిక్ష) సినిమాగా రాబోతున్న ‘టిక్ టిక్ టిక్’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. తమిళంలో ఎందరు స్టార్లు ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక దారి ఉందని నిరూపించిన యువనటుడు జయం రవి. ఎడిటర్ మోహన్ తనయుడైన రవి, తెలుగు సినిమా జయం రీమేక్‌తో తమిళంలో బ్లాక్‌బస్టర్ హీరోగా నిలిచి తనకి సూపర్ హిట్ ఇచ్చిన జయం చిత్రాన్నే తన ఇంటి పేరుగా మార్చుకుని జయం రవిగా మారాడు. ఇటీవలే తని ఒరువన్ (తెలుగులో ధ్రువ) చిత్రంతో మరిన్ని మంచి మార్కులు కొట్టేశాడు. అయితే ఆఫర్లు ఎన్ని వచ్చినా సెలక్టివ్‌గా కథలు ఎంచుకుంటూ వైవిధ్యంతో దూసుకొస్తున్న హీరోగా జయం రవి పేరు ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో మారుమ్రోగుతోంది. ఆ క్రమంలోనే అంతరిక్షం నేపథ్యంలో ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తున్నాడు అనగానే ప్రేక్షకులలో మరింత ఉత్సుకత పెరిగిపోయింది.
జయం రవి హీరోగా, నివేద పుదిరాజ్ హీరోయిన్గా శక్తి సౌందర రాజన్ దర్శకత్వంలో తొలి స్పేస్ సినిమా `టిక్ టిక్ టిక్` తెరకెక్కింది. ఈ సినిమా ఈపాటికే రిలీజ్ కావాల్సి ఉన్నా రకరకాల కారణాలతో వాయిదా పడింది. మొత్తానికి సినిమా ఎన్నో అవాంతరాల మధ్య, ఆర్థిక కష్టాల మధ్య తెరకెక్కి ఎట్టకేలకు రిలీజవుతోంది. ఈ సినిమా అంతరిక్షం నేపథ్యంలో వచ్చిన తొలి సౌత్, అలాగే తొలి ఇండియన్ సినిమా అవుతుంది. కానీ స్పేస్ షిప్ నేపధ్యంలో తీసే ఏ సినిమాకైనా దాదాపు మేకింగ్ ఒకేలా ఉంటుంది. కథ విషయంలో ఎన్ని ట్విస్ట్ లు పెట్టినా షూట్ సెటప్ మాత్రం ఒకేలా ఉంటుంది. అయితే సినిమా ట్రైలర్‌ని బట్టి చూస్తుంటే సినిమాని టెక్నికల్ గా అత్యుత్తమ ప్రమాణాలతో తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. భూమికి గ్రహశకలం నుంచి ముప్పు పొంచి ఉంటుంది. ఆ గ్రహశకలం భూమికి తాకితే ఆ ప్రభావంతో మన దేశానికి తీవ్ర నష్టం వాటిల్లనుంది. దీన్ని ఓ అణ్వాయుధంతోనే నాశనం చేయగలరు, సో భూమి మీదకి వస్తున్న గ్రహశకలాన్ని ఎలా నాశనం చేశారనేదే ఈ సినిమా కాన్సెప్ట్ గా తెలుస్తోంది.
ఇండస్ట్రీ మారాలి…అన్ని రకాల సినిమాలు రావాలంటూ అని రివ్యూ మైక్ దొరికితే అని లెక్చర్లు ఇవ్వడమే పనిగా పెట్టుకుంటారు కొందరు. చెప్పడం కాదు ప్రయోగాత్మక సినిమాలు వస్తే జనం థియేటర్లకు వెళ్లి చూడాలి. అప్పుడే ప్రయోగాలు చేసే నిర్మాతలు, దర్శకులు ఎంకరేజ్మెంట్గా భావించి మరిన్ని సినిమాలు చేస్తారు. ఇప్పుడు మునుపెన్నడూ లేని సబ్జెక్టుతో ఇండియన్ సినిమా స్క్రీన్‌పై టిక్ టిక్ టిక్ ఓ ప్రయోగం కాబోతోంది. ఈ సినిమా విజయం సాధిస్తే అది ప్రస్తుతం సెట్స్ మీద వరుణ్ తేజ్-సంకల్ప్ కాంబినేషన్లోని రెండో ఇండియన్ స్పేస్ సినిమాకి పెద్ద బూస్ట్ అవుతుందనడంలో సందేహం లేదు.