Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జయలలిత మరణంతో తమిళనాడులో ఏర్పడ్డ రాజకీయ శూన్యతను రజనీకాంత్, కమల్ హాసన్ భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రముఖ సినీనటి, మాజీ ఎంపీ జయప్రద అభిప్రాయపడ్డారు. అయితే రాజకీయాల్లో రాణించడం చాలా కష్టమని, రాజకీయాలంటే రెండున్నర గంటల సినిమా ఏమీ కాదని హెచ్చరించారు. వారిద్దరూ నడవాలని భావిస్తున్న దారి పూలదారేమీ కాదని, ఎన్నో ముళ్లు, రాళ్లతో నిండిన క్లిష్టమైన మార్గాన్ని వారు ఎంచుకుంటున్నారని, జాగ్రత్తగా చూసి అడుగువేయాలని సూచించారు. సినిమాలకు, రాజకీయాలకూ ఏ మాత్రం సంబంధం ఉండదని అన్నారు. వారిద్దరి రాజకీయ ప్రవేశాన్ని తాను స్వాగతిస్తున్నానని, అయితే ఇద్దరిలో ఎవరు రాణిస్తున్నారన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేనన్నారు.
జయప్రదే కాదు… అనేకమంది రాజకీయ విశ్లేషకులు సైతం ఇదే రకం అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నారు. తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుత పరిస్థితులును అనుకూలంగా మలుచుకోవాలన్న అభిప్రాయంతో కమల్, రజనీలు రాజకీయాల్లోకి వస్తున్నప్పటికీ… వారు ఇక్కడ అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకోవడం అంత ఈజీ కాదంటున్నారు. సినీ నేపథ్యం ఉన్న ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత వంటి వారిని తమిళ ప్రజలు ఆదరించినప్పటికీ… అదే పరిస్థితి ఇప్పుడు పునరావృతం అవుతుందన్న గ్యారంటీ లేదంటున్నారు. కమల్, రజనీలిద్దరూ ఒకేసారి రాజకీయాల్లోకి వస్తుండడంతో వారిద్దరి మధ్య సినిమాల్లోలానే ఇక్కడ కూడా పోటీ వాతావరణమే ఉంటుందని విశ్లేషిస్తున్నారు. ఇప్పటిదాకా తమిళనాడు రాజకీయాలను నడిపించిన డీఎంకె, అన్నాడీఎంకెను ప్రజలు వద్దనుకున్నప్పటికీ… ఆ వ్యతిరేక ఓటు కమల్, రజనీల మధ్య చీలిపోయి ఎవ్వరికీ లాభించదన్న వాదనలు వినపడుతున్నాయి. సినీరంగంలో ఓ వెలుగు వెలిగి రాజకీయాల్లో ప్రవేశిస్తున్నవారి భవిష్యత్ ను వచ్చే ఎన్నికలు నిర్దారించనున్నాయి.