Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఈసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద పడ్డాడు. అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం లాంటి తప్పులు పవన్ కి శాపంగా మారతాయని జేసీ కామెంట్ చేశారు. విత్తనాలు వేయడంతో సరిపోదని పంట చేతికి వచ్చిన దాకా చూసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. జేసీ ఇలా మాట్లాడడం కొత్త కాదు. తాను సుదీర్ఘ కాలం పని చేసిన కాంగ్రెస్ పార్టీని శవంతో పోల్చారు, ఇక ప్రస్తుతం ఎంపీ గా గెలిచి పని చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుని కూడా ఎన్నో సందర్భాల్లో ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడారు. ఇక వైసీపీ అధినేత జగన్ ని వాడు, వీడు తో మొదలు పెట్టి ఎన్నో మాటలు అన్నారు. ఇదిగో ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద కు వచ్చారు.
నిజానికి జేసీ లాగా ఇంకో రాజకీయ నాయకుడు మాట్లాడితే పెద్ద రచ్చ అయ్యేది. కానీ టీడీపీ లాంటి పార్టీ కూడా ఆయన మాటలను సీరియస్ గా తీసుకోవడం లేదు. ఇక వైసీపీ మొదట్లో జేసీ డైలాగ్స్ తో ఇబ్బందిపడినా ఆయన్ని కదిలించుకోవడం వల్ల జరిగే నష్టం ఎక్కువని మౌనంగా ఉండటం అలవాటు చేసుకుంది. ఇక సోషల్ మీడియా కూడా ఒకప్పుడు జేసీ కామెంట్స్ ని హైలైట్ చేసేది. ఇప్పుడు మాత్రం ఆ ధోరణిలో మార్పు వచ్చింది. ఎందుకు అందరూ లైట్ తీసుకుంటున్నారా అనిపించింది. ఇదే విషయాన్ని ఓ సీనియర్ జర్నలిస్ట్ ని అడిగితే ఆయన భలే సమాధానం ఇచ్చాడు. ఇంటి పెద్దకు ఓ వయసు దాటాక చాదస్తం వస్తుంది, అయితే అప్పటిదాకా ఆయన చేసిన శ్రమ గుర్తుకు వచ్చి ఆయన్ని ఎలాగోలా భరిస్తారు. ఇప్పుడు పొలిటికల్ గా పార్టీలన్నీ జేసీ ని అలాగే చూస్తున్నాయని సదరు జర్నలిస్ట్ చెప్పిన మాటల్లో నిజం ఉందనిపిస్తోంది. అలా అనుకునే పార్టీలు ఆయన్ని అలా వదిలేస్తున్నాయేమో.