మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) కొత్త కార్యవర్గం ఏర్పాటయ్యాక గత కొన్ని నెలల్లో ఎన్ని వివాదాలు నడిచాయో తెలిసిందే. మా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన నరేష్.. సంఘం కార్యకలాపాలకు దూరంగా ఉండటం, ఆయన గైర్హాజరీలో ‘మా’ ఉపాధ్యక్షుడైన రాజశేఖర్ నాయకత్వంలో సమావేశాలు నిర్వహించి.. నరేష్‌కు నోటీసులు కూడా జారీ చేయడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే.
దీనిపై పెద్ద గొడవే నడిచింది. ఆ గొడవను పరిష్కరించుకోకుండా సంఘంలో గ్రూపు రాజకీయాలు నడుపుతుండటం ఇండస్ట్రీ పెద్దలకు రుచించట్లేదు. ఈ నేపథ్యంలో వివాదాలన్నీ పరిష్కరించడం కోసం రాజశేఖర్ కుటుంబం మా సభ్యుల కోసం వన భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేస్తుండటం విశేషం.
సంఘం ఖర్చుతో కాకుండా జీవిత, రాజశేఖర్ సొంతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుండటం విశేషం. హైదరాబాద్‌లోని ఫీనిక్స్ ప్రాంగంణంలో జరగబోయే ఈ కార్యక్రమానికి మా సభ్యులందరినీ ఆహ్వానిస్తున్నారు. దాదాపు 400 మంది ఇందులో పాల్గొంటారని జీవిత అంటోంది. మరి అందరినీ పిలిచి సమస్యలు పరిష్కరించుకుంటారా లేక నరేష్‌కు వ్యతిరేకంగా అందరినీ ఏకం చేసే ప్రయత్నం చేస్తారా అన్నది చూడాలి.
అసలు ఈ కార్యక్రమానికి నరేష్ వస్తాడా లేదా.. అసలు ఆయన్ని ఆహ్వానిస్తున్నారా లేదా అన్నది కూడా ఆసక్తికరమే. వన భోజనాల కార్యక్రమం గురించి జీవితను అడిగితే..” గతంలో ‘మా’ తరఫున వన భోజనాలు ఏర్పాటు చేసేవారు. అప్పుడు ఎప్పుడో చిరంజీవిగారి చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ‘మా’ నుంచి చేయలేదు. ఇప్పుడు కూడా ‘మా’లో చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. అందుకే ‘మా’ ఆధ్వర్యంలో కాకుండా మేం వ్యక్తిగతంగా చేస్తున్నాం.
ఇలా చేయడం వల్ల ఎలాంటి వివాదాలు రావనే భావిస్తున్నాం. రాబోయే నెల రోజుల్లో ‘మా’లో ఉన్న సమస్యలకు ఏదో ఒక పరిష్కార మార్గాన్ని కనుక్కుంటాం. ప్రస్తుతానికి పరిష్కరించి, ఆ తర్వాత వన భోజనాలు ఏర్పాటు చేసేంత టైమ్ లేదు. కార్తీక మాసం వచ్చే వారంతో అయిపోతుంది కాబట్టి.. ఇది ప్లాన్ చేశాం” అని చెప్పారు.