రాచ‌రికం దిశ‌గా సాగుతున్న క‌మ్యూనిస్టు దేశం

Jinping To Continues As China President As Long As He Wants

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
క‌మ్యూనిస్టు దేశం చైనాలో రాచ‌రికం త‌ర‌హా సంప్ర‌దాయం మొద‌లయింది. చైనా గ‌తిని స‌మూలంగా మార్చివేస్తుంద‌ని భావిస్తున్న చ‌రిత్రాత్మ‌క రాజ్యాంగ సవ‌ర‌ణ‌కు పార్ల‌మెంట్ ఆమోదం తెలిపింది. మామూలుగా చైనాలో అధ్య‌క్ష‌ప‌ద‌వి విష‌యంలో అమెరికా త‌ర‌హా ప‌ద్జతే ఇప్ప‌టిదాకా అమ‌ల్లో ఉంది. ఐదేళ్లు చొప్పున‌… రెండుసార్లు మాత్ర‌మే అధ్య‌క్షునిగా ఉండే ప‌ద్ధ‌తి 1982లో డెంగ్ జియావోపింగ్ ప్ర‌వేశ‌పెట్టారు. మావో పాల‌న త‌ర్వాత మ‌రో జీవిత కాలం నియంతృత్వం త‌లెత్త‌కుండా ఉండేందుకు ఈ ప‌రిమితిని తీసుకురాగా… తాజా రాజ్యాంగ‌స‌వ‌ర‌ణ‌తో ఆ ప‌ద్ధ‌తికి `స్వ‌స్తి ప‌లికారు. అధ్య‌క్షుడితో పాటు ఉపాధ్య‌క్షుడి ప‌ద‌వీకాలంపై ఉన్న ప‌రిమితిని ఎత్తివేసే ప్ర‌తిపాద‌న‌పై చైనా పార్ల‌మెంట్ నేష‌న‌ల్ పీపుల్స్ కాంగ్రెస్ లాంఛ‌నంగా ఆమోద‌ముద్ర‌వేసింది. అధికార సూచ‌న‌ల‌కు అనుగుణంగా నడుచుకుంటుంద‌నే పేరు ఉన్నఎన్ పీసీకి ర‌బ్బ‌ర్ స్టాంప్ పార్ల‌మెంట్ అని విమ‌ర్శిస్తుంటారు. తాజా ప్ర‌తిపాద‌న‌పైనా ఎన్ పీసీ అదేవిధంగా వ్య‌వ‌హరించింది.

ఎన్ పీసీలోని 2598 మంది అనుకూల ఓటు వేయ‌గా… వ్య‌తిరేకంగా రెండు ఓట్లు ప‌డ్డాయి. పార్టీలో భిన్న‌త్వం ఉంద‌ని చెప్పుకునేందుకు పార్టీయే రెండు వ్య‌తిరేక ఓట్లు వేయించింద‌ని భావిస్తున్నారు. ఈ స‌వ‌ర‌ణ‌తో 64 ఏళ్ల జిన్ పింగ్ పార్టీ వ్య‌వ‌స్థాప‌క చైర్మ‌న్ మావోజెడాంగ్ త‌ర్వాత జీవిత‌కాలం పాటు అధికారంలో కొన‌సాగే రెండో నేతగా నిల‌వనున్నారు. ఇప్ప‌టికే జిన్ పింగ్ చైనా క‌మ్యూనిస్ట్ పార్టీకి, శ‌క్తిమంత‌మైన సైనిక క‌మిష‌న్ కు నాయ‌క‌త్వం వ‌హిస్తున్నారు. చైనా లో 1949 నుంచి అమ‌ల్లో ఉన్న ఏక‌పార్టీ వ్య‌వ‌స్థ‌లో ప‌ద‌వీకాల ప‌రిమితి తొల‌గింపే అతిపెద్ద రాజ‌కీయ మార్పుగా ప‌రిగ‌ణిస్తున్నారు. తాజా రాజ్యాంగ సవ‌ర‌ణ‌తో చైనా… ఏక‌పార్టీ దేశం నుంచి ఏక‌నాయకుడి దేశంగా మారుతుందన్న విశ్లేష‌ణ‌లు వెలువడుతున్నాయి.

ఇప్ప‌టికే జిన్ పింగ్ ను కొంద‌రు చ‌క్ర‌వ‌ర్తిగానూ అభివ‌ర్ణిస్తున్నారు. జిన్ పింగ్ కు అప‌రిమిత ప‌ద‌వీకాలాన్ని క‌ట్ట‌బెట్ట‌డంపై ప్ర‌పంచ వ్యాప్తంగా ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ముఖ్యంగా భార‌త్ దీనిపై ఎక్కువ‌గా ఆందోళ‌న చెందుతోంది. గ‌త ఏడాది త‌లెత్తిన డోక్లామ్ ప్ర‌తిష్టంభ‌న‌, ఆక్ర‌మిత కాశ్మీర్ గుండా చైనా-పాకిస్థాన్ ఆర్థిక కారిడార్ నిర్మాణం, నేపాల్, శ్రీలంక, మాల్దీవుల్లో ర‌వాణా ప్రాజెక్టులు వంటివ‌న్నీ జిన్ పింగ్ హ‌యాంలో చేప‌ట్టిన‌వే. ఇవ‌న్నీ భార‌త్ కు త‌ల‌నొప్పిగా ప‌రిణ‌మిస్తాయ‌ని అంత‌ర్జాతీయ ప‌రిశీల‌కులు విశ్లేషిస్తున్నారు. నిజానికి అధికార ప‌రిమితి తొల‌గింపుపై చైనా ప్ర‌జ‌ల్లోనే వ్య‌తిరేక‌త ఉంది. కానీ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఎవ్వ‌రూ నోరుమెద‌ప‌డం లేదు. సోషల్ మీడియాలో వ్య‌తిరేక వ్యాఖ్యానాల‌ను సైతం ప్ర‌భుత్వ సంస్థ‌లు అనుమ‌తించ‌క‌పోవ‌డంతో చైనీయుల్లో మౌనం రాజ్య‌మేలుతోంది.