నటుడిగా మారిన రెజ్లింగ్ స్టార్ జాన్సేన మరోసారి పెళ్లి చేసుకుని వార్తల్లోకి ఎక్కారు. ఏడాది కాలంగా డేటింగ్ చేస్తోన్న ప్రియురాలు షే షరియాత్జాదేను రహస్యంగా పెళ్లాడారు. ఫ్లోరిడాలోని తంపాలో సోమవారం ఈ కార్యక్రమం జరిగింది. అయితే ఈ వివాహ విషయాన్ని ఆయన అధికారికంగా ధ్రువీకరించకపోయినప్పటికీ అక్కడి మీడియాకు మాత్రం సమాచారం లీకైంది. దీంతో అతని పెళ్లి సర్టిఫికెట్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా గతేడాది మార్చిలో జాన్సేన “ప్లేయింగ్ విత్ ఫైర్” సినిమా చిత్రీకరణ జరుపుతున్న సమయంలో ఈ ఇద్దరికీ చూపులు కలిశాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో షే షరియాత్జాదే ఎడమ చేతికి వజ్రపుటుంగరం కనిపించడంతో నిశ్చితార్థం కూడా జరిగిపోయినట్లు వార్తలు వినిపించాయి. ఎట్టకేలకు తాజాగా డేటింగ్‌కు ముగింపు పలుకుతూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. కాగా జాన్సేన 2009లో మొదట ఎలిజబెత్ హుబెర్డీయును పెళ్లాడారు. తర్వాత ఆమెతో తెగతెంపులు చేసుకుని నిక్కీ బెల్లాతో తొమ్మిదేళ్లపాటు ప్రేమాయణం జరిపారు, కానీ అనుకోని కారణాల వల్ల 2018లో బ్రేకప్ చెప్పుకున్నారు.