Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పదవే నేటి రాజకీయాల పరమావధి. అయితే ఆ పదవి కోసం కాక సమాజంలో మార్పు కోసం రాజకీయాలు చేస్తా అంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాస్త కొత్తగా కనిపిస్తున్నాడు. అభిమానులు కాబోయే సీఎం అంటూంటేనే పవన్ కి నచ్చడం లేదు . ఆ నినాదాలు వద్దని ఎక్కడికక్కడ ఫ్యాన్స్ కి క్లాస్ పీకుతున్నారు. దీంతో కుర్చీ రాజకీయాలు మాత్రమే చూసిన వారికి ఈ వ్యవహారం మింగుడు పడడం లేదు. జనసేన కార్యకర్తలు సైతం పవన్ వాదనను ఎలా అర్ధం చేసుకోవాలో తెలియక అవస్థ పడుతున్నారు. అయితే ఇదే వాదన ఎత్తుకుంటే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి అద్భుత రాజకీయ భవిష్యత్ ఉంటుందని సీనియర్ జర్నలిస్ట్ కరణ్ థాపర్ అంటున్నారు.
మోడీ ప్రాభవంతో కకావికలమైన కాంగ్రెస్ కి పూర్వ వైభవం రావాలంటే తమకు అధికారం వచ్చినా ప్రధాని పదవిని తాను తీసుకోకుండా అన్ని విధాలుగా అర్హుడైన వ్యక్తిని ఆ కుర్చీలో కూర్చోబెడతామని రాహుల్ చెప్పాలని థాపర్ సూచిస్తున్నారు. ఒకప్పుడు సోనియా గాంధీ కూడా ఇలాంటి మాటకు కట్టుబడి ఉండడం వల్లే యూపీఏ రెండు సార్లు విజయం సాధించిందని థాపర్ అభిప్రాయం. అయితే థాపర్ అభిప్రాయంతో విభేదించేవాళ్లు కూడా లేకపోలేదు. ఇప్పటికే రాహుల్ మీద బాధ్యతలకు దూరంగా ఉంటాడని పేరుందని, ప్రధాని పదవి వద్దంటే చెడు సంకేతాలు జనంలోకి వెళతాయని కొందరి వాదన. ఏదేమైనా గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో రాహుల్ నాయకత్వ పటిమ మీద అంతకుముందున్న తేలిక భావం కొంత తగ్గిందనే చెప్పుకోవాలి.