యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత’ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక తాజాగా జరిగిన విషయం తెల్సిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని సినిమాను ఈనెల 11న దసరా కానుకగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇక ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ చేసిన ఎమోషనల్ స్పీచ్ నందమూరి అభిమానులను తీవ్రంగా కలచి వేసింది. ఎప్పుడు కూడా తారక్‌ను అలా చూడలేదని, తారక్ కన్నీరు పెట్టుకుంటూ ఉంటే తమ కన్నీరు ఆగలేదు అంటూ అభిమానులు అంటున్నారు.
తన తండ్రి మరణం గురించిన ప్రస్థావన వచ్చిన సమయంలో ఎన్టీఆర్ కన్నీరు ఆపుకోలేక పోయాడు. తన తండ్రి ఉన్నప్పుడు విలువ తెలియలేదని, ఆయన మరణం తర్వాత ఆయన గురించి ఆలోచిస్తే కన్నీరు ఆగడం లేదు అంటూ ఎన్టీఆర్ అన్నాడు. మా ఇంట్లో జరిగిన విషాదం మరే ఇంట్లో కూడా జరగవద్దని, అందుకే మీరు జాగ్రత్తగా వెళ్లండి అంటూ అభిమానులకు ఎన్టీఆర్ సూచించాడు. ఎన్టీఆర్ మాటలకు ప్రతి ఒక్క అభిమానితో పాటు సాదారణ ప్రేక్షకులు కూడా కన్నీరు పెట్టుకున్నారు. ఎన్టీఆర్ చాలా ఎమోషనల్ అవ్వడంతో పక్కన ఉన్న త్రివిక్రమ్ ఓదార్చాడు. ఈ చిత్రంతో బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను ఎన్టీఆర్ దక్కించుకుంటాడు అనే టాక్ సినీ వర్గాల్లో వ్యక్తం అవుతుంది.