Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్ లో లెక్కలు మారుతున్నాయి. మెగా స్టార్ చిరంజీవి తర్వాత నెంబర్ 1 స్థానాన్ని ఆక్రమించడానికి ఎందరో పోటీ పడ్డారు. కొన్నిసార్లు కొందరు గెలిచారు అని కూడా అనిపించింది. ఇలా కొన్నాళ్ల పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , సూపర్ స్టార్ మహేష్ మధ్య ఈ దాగుడుమూతల ఆట సాగింది. అత్తారింటికి దారేది తర్వాత రెండు ఫెయిల్యూర్స్ వచ్చేసరికి పవన్ స్టామిన తగ్గినట్టు అర్ధం అయ్యింది. మహేష్ కూడా మాస్ లోకి పూర్తిగా వెళ్లకపోవడంతో నెంబర్ వన్ ఛైర్ ఆలా దూరంగానే ఉండిపోయింది. ఈ విధంగా నెంబర్ వన్ ఛైర్ ఆ ఇద్దరినీ టెంప్ట్ చేసింది గానీ సొంతం కాలేదు. మరికొందరు ఆ ఛైర్ చుట్టుపక్కలకి వచ్చారు గానీ దాన్ని అందుకోలేకపోయారు. కానీ ఇప్పుడు జైలవకుశ తో ఆ ప్లేస్ లోకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వచ్చాడా అనిపిస్తోంది. ఇదేదో ఆషామాషీగా చెబుతున్న మాట కాదు. దానికి కూడా కొన్ని లెక్కలు వున్నాయి.
ఏ నటుడు అయినా స్టార్ కావాలంటే ఆయన హిట్ సినిమా చేసిన కలెక్షన్ కొలమానం అవుతుంది. ఇక ఏ స్టార్ అయినా టాప్ ఛైర్ సొంతం చేసుకోవాలంటే ఆయన ప్లాప్ సినిమా చేసే వసూళ్లు ముఖ్యం. సినిమా బాగా లేకపోయినా ఆ నటుడి కోసం జనం థియేటర్ దాకా వస్తుంటే అదే ఆయన నెంబర్ ని పటిష్టం చేస్తుంది. డాన్స్ , ఫైట్స్ , డైలాగ్స్ , మరీ ముఖ్యంగా మాస్ కామెడీ తో రంజింపజేయగలిగితే అతనికి తిరుగు ఉండదు. ఇలా అన్నిటిలో అల్ రౌండర్ గా వుంటూ వరసగా విజయవంతమైన సినిమాలు చేస్తుంటే, నటనకి అవకాశం వున్న కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటే ఆ నెంబర్ వన్ కుర్చీ కచ్చితంగా అతనిదే.
ఇప్పుడు చెప్పుకున్న విషయాలు అన్నీ ఒకప్పుడు మెగా స్టార్ చిరంజీవి సొంతం. ఇప్పుడు ఎన్టీఆర్ లో ఆ లక్షణాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. తాజాగా రిలీజ్ అయిన జైలవకుశ అందుకు తిరుగులేని సాక్ష్యం. ఈ సినిమా మీద అక్కడక్కడా డివైడ్ టాక్ వుంది. కానీ ఎన్టీఆర్ గురించి యాంటీ ఫాన్స్ కూడా వారెవ్వా అంటున్నారు. అంతకన్నా జైలవకుశ కి వస్తున్న కలెక్షన్స్ చూస్తుంటే తక్కువ రేటింగ్ ఇచ్చిన వెబ్ సైట్స్ తల పట్టుకుంటున్నాయి. ఓ మాములు కధకి తన నటనతో ఈ స్థాయి తెచ్చిన ఎన్టీఆర్ కచ్చితంగా నెంబర్ వన్. అది ఈ సినిమా తోనా, ఇంకో సినిమాతోనా అన్నది చెప్పలేకపోయినా… టాప్ ఛైర్ మాత్రం ఆయన సొంతం కావడం ఖాయం అనిపిస్తోంది.