కోర్టు విధుల నుంచి బదిలీ చేశారనే ఆగ్రహంతో ఓ ఆఫీస్ అసిస్టెంట్ న్యాయమూర్తిపై ఏకంగా హత్యకు యత్నించిన ఘటన తమిళనాడులో మంగళవారం చోటు చేసుకుంది. సేలం జిల్లా అస్థంపట్టిలో 24 కోర్టుల సముదాయం ఉంది. నాలుగో నేరవిభాగం కోర్టులో పొన్ పాండి న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్నారు. కేసుల విచారణ నిమిత్తం మంగళవారం ఉదయం 11 గంటలకు కోర్టుకు చేరుకోగా అక్కడే పొంచి ఉన్న ప్రకాష్ అనే ఆఫీస్ అసిస్టెంట్ అకస్మాత్తుగా ఆయన్ను కత్తితో పొడవబోయాడు.
అప్రమత్తమైన న్యాయమూర్తి కత్తిని అడ్డుకోగా చేతికి బలమైన గాయమైంది. అక్కడే ఉన్న వారు ప్రకాష్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఓమలూరు అనే ప్రాంతంలోని కోర్టుకు ప్రకాష్ ఇటీవల బదిలీ అయ్యాడు. దీనిపై అతడు జడ్జితో గొడవపడినట్లు సమాచారం. ఈ కక్షతోనే దాడికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.