ఆంధ్రప్రదేశ్ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటిషన్ పై హైకోర్టులో జస్టిస్ కనగరాజ్ తాజాగా ఫైనల్ కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. నిమ్మగడ్డ పిల్ తో పాటు దాఖలైన 12 పిల్స్ కు ఒకే కౌంటర్ ను ఆయన దాఖలు చేయడం విశేషం. అలాగే.. ఈ కౌంటర్ దాఖలు చేయడం ఆలస్యమైనందుకు మన్నించాలని కూడా కోర్టును ఆయన కోరారు. ఓటరు కానీ అభ్యర్ది కానీ కాకుండా ఎస్ఈసీ అర్హతలపై ఎలా రిట్ దాఖలు చేస్తారని కనగరాజ్ ఈ పిటిషన్ లే పేర్కొన్నారు.
అదేవిధంగా నిమ్మగడ్డ కాకుండా మిగతా ఎవరెకీ కూడా దీనిపై పిల్ దాఖలు చేసే అర్హత లేదని కనగరాజ్ స్పష్టం చేశారు. గవర్నర్ ఆమోదించిన ఆర్డినెన్స్ ను పిటిషన్లర్లు ప్రశ్నించలేరని అన్నారు. అలాగే కేంద్రానికి భద్రత కోరుతూ నిమ్మగడ్డ దాఖలు చేసిన ఆఫీస్ ఫైల్స్ అందుబాటులో లేవని వివరించారు. ఆర్డినెన్స్ ద్వారా తొలగించాక నిమ్మగడ్డ కమిషనర్ హోదాలో ఎలా పిల్ వేస్తారని కూడా మరో కీలకమైన ప్రశ్నాస్త్రాన్ని సంధించారు జస్టిస్ కనకరాజు.
అంతటితో ఆగకుండా ఎన్నికల కమిషనర్ నియామకం, సర్వీస్ రూల్స్ గవర్నర్ పరిధిలోనివేనని తెలిపిన ఆయన నిమ్మగడ్డ ప్రభుత్వ సేవకుడిగానే ఎన్నికల కమిషనర్ పదవిలో నియమితులయ్యారని వివపించారు. నిమ్మగడ్డ చెప్తున్న ఎన్నికల హింస ప్రస్తుతం సాధారణ స్థితిలోకి వచ్చిందని.. స్ధానిక ఎన్నికలపై దాఖలైన ఫిర్యాదులు ఒక్కశాతం కూడా లేవని వెల్లడించారు. స్థానిక పోరు వాయిదాకు కారణమైన కేంద్ర ప్రభుత్వ కరోనా హెచ్చరికలను నిమ్మగడ్డ ప్రస్తావించలేదని.. స్ధానిక ఎన్నికల వాయిదా కోసం నిమ్మగడ్డ ఎవరినీ సంప్రదించలేదని కూడా స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ రహస్యమనే నిమ్మగడ్డ వాదనలో ఏమాత్రం పసలేదని నిమ్మగడ్డ తొలగింపు కోసమే ఆర్డినెన్స్ తీసుకొచ్చారనే వాదన న్యాయపరంగా చెల్లదని ఆయన పిటిషన్ లో వివరించారు.
అంతేకాకుండా ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసమే పంచాయతీ రాజ్ చట్టంలో మార్పులు చేశారని.. ఎన్నికల కమిషనర్ నియామకానికి గవర్నర్ కు సర్వాధికారాలు ఉన్నాయని తెలిపారు. చట్టంలోని మార్పులతో నిమ్మగడ్డ పదవి కోల్పోయారని.. ఆయన్ను ప్రభుత్వం తొలగించలేదని అన్నారు. తాను లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించానని ఓ ప్రభుత్వ ఉద్యోగిగా నిమ్మగడ్డ చెప్పకూడదని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్ విషయంలో చర్యలు తీసుకొనేందుకు గవర్నర్ కు విచక్షణాధికారం ఉందని.. ఆర్డినెన్స్ విషయంలో గవర్నర్ నిబంధనలు ఉల్లంఘించారనడం సరికాదని నిమ్మగడ్డ పిటిషన్ లో పేరాలకు పేరాలు ఇతర పిటిషనర్లు కాపీ కొట్టారని కనగరాజ్ గుర్తు చేయడం పైనల్ ట్విస్ట్ గా చెప్పవచ్చు.