ఆంగ్ల చిత్రంలో కాజల్?

kajal in hollywood movie

ప్రస్తుతం కథానాయికలు కెరీర్‌పరంగా తమ పరిధుల్ని విస్త్రృతం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దక్షిణాది లేదా హిందీ చిత్రసీమకు పరిమితమైపోకుండా అంతర్జాతీయ యవనికపై సత్తాచాటాలని తపిస్తున్నారు. బాలీవుడ్ అగ్ర నాయికలు ప్రియాంకచోప్రా, దీపికాపదుకునే హాలీవుడ్‌లో మంచి గుర్తింపును సంపాదించుకున్న విషయం తెలిసిందే. వీరి కోవలోనే సీనియర్ కథానాయిక కాజల్ అగర్వాల్ ఓ ఆంగ్ల చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నది. వివరాల్లోకి వెళితే…యువ హీరో మంచు విష్ణు తెలుగు-ఆంగ్ల భాషల్లో ఓ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించనుందని సమాచారం. ఓ వినూత్నమైన పాయింట్‌తో ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధానంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని హాలీవుడ్ దర్శకుడు డైరెక్ట్ చేయబోతున్నాడట. కథలోని నవ్యత నచ్చడంతో ఈ సినిమాలో నటించడానికి కాజల్ అగర్వాల్ వెంటనే అంగీకరించిందని చెబుతున్నారు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు తుదిదశలో ఉన్నాయని, భారీ వ్యయంతో ఈ సినిమాను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారని ఫిల్మ్‌నగర్ వర్గాల్లో వినిపిస్తున్నది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ పాత్ర చిత్రణ పూర్తి వైవిధ్యమైన పంథాలో ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని త్వరలో వెల్లడించబోతున్నారు. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించిన సీత చిత్రం ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సొగసరి తెలుగులో శర్వానంద్ సరసన రణరంగం చిత్రంలో నటిస్తున్నది.